శనివారం 08 ఆగస్టు 2020
Nirmal - Aug 02, 2020 , 01:38:10

చిన్ననాటి దోస్తులను దగ్గర చేస్తున్న సోషల్‌ మీడియా

చిన్ననాటి దోస్తులను  దగ్గర చేస్తున్న సోషల్‌ మీడియా

స్నేహబంధాన్ని మించిన గొప్ప బంధం సృష్టిలో మరేదీ లేదని పెద్దలు చెబుతుంటారు. బాల్య స్నేహం, మధ్య వయస్సులోనూ, వృ ద్ధాప్యంలోనూ ఎంతో తీయనైనదిగా అనిపిస్తుంది. ఆసరా కోరినప్పు డు అండగా నిలిచి మన చేయి పట్టుకుని మంచి భవిష్యత్తులోకి నడిపించే హస్తమే నేస్తం. మన విజయాల్ని తనదిగా భావించి ఆనందం తో చప్పట్లు కొట్టే మిత్ర బంధం.. మనం బాధపడుతున్నప్పుడు అక్కున చేర్చుకుని కన్నీరు తుడిచే స్నేహం.. ట్రెండు మారుతున్నా.. బెస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రం మారడు.. ఇలా ఎందరెందరో స్నేహానికి తమదైన శైలిలో నిర్వచనాలిచ్చారు. స్నేహితుల మధ్య స్వార్థం, దాపరికా లు ఉండకూడదు అంటారు. నిజానికి పరిచయమైన ప్రతివారూ స్నేహితులు కాలేరు. 

ఆదర్శం ఆ స్నేహం..

 పవిత్రమైన స్నేహ బంధానికి మరింత గౌరవం కల్పించిన వారు పురాణాల్లో, చరిత్రతో పాటు నేటి తరంలో కూడా ఉన్నారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు, కుచేలుడు, నిన్నటి తరంలో బాపు, రమణ స్నేహానికి ఎంతో ఔన్నత్యం కల్పించారు. కులమతాలు తెలియవు.. పేద, గొప్ప తేడా ఉండదు.. ఉన్నది పంచుకోవడం.. బంధం పెంచుకోవ డం మాత్రమే తెలిసే వయసు అది. కల్లాకపటం తెలియని పాల మనసుల బాల స్నేహ బంధం జీవితం చివరి వరకు నెమరువేసుకున్నా తరగతి జ్ఞాపకాల నిధిగా నిలుస్తుంది. మధ్య వయస్సు దాటాక.. వృ ద్ధాప్యం మీద పడ్డాక... శారీరక శక్తులు ఉడిగి జ్ఞాపకాలు నెమరువేసుకోవడం మినహా మరేమీ చేయలేని స్థితి ఏర్పడుతుంది. వేదాం తం, వైరాగ్యం పెరుగుతాయి. తాము ఎవరికీ అవసరం లేదేమోనన్న అభద్రతాభావం చోటు చేసుకుంటుంది. ఎవరైనా ఆత్మీయంగా పలుకరించి కాసేపు తీరిగ్గా మాట్లాడే వారి కోసం ఎదురు చూడాలనిపిస్తుంది. ఒకరినొకరు ఓదార్చుకుని నిశ్చలమైన స్నేహ బంధాన్ని పెనవేసుకోవాలనిపిస్తుంది. 

ఆలోచనే ప్రధానం..

 కుటుంబ బాధ్యతలు మీదపడి జీవితంలో స్థిరపడ్డాక ఇంత వరకు తనకు స్నేహితులుగా నిలిచిన వారెవరో...? భవిష్యత్తులో స్నేహాన్ని కొనసాగించేవారెవరోనన్న ఆలోచన వస్తుంది. కొత్త స్నేహం చేయాలంటే విభిన్న కోణాల నుంచి ఆలోచించాలని అనుభవం చెబుతుంది. స్నేహం తన కుటుంబానికి, జీవితానికి ఏ మాత్రం తోడ్పడగలదోనన్న ఆలోచన తెప్పిస్తుంది. చేసిన స్నేహాన్ని చిరకాలం నిలుపుకోవాలంటే మధ్య వయస్సు స్నేహం కడవరకు మరిచిపోలేని బంధంగా నిలుస్తుంది. 

మొదలైంది ఇలా..

 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. 1935లో యునైటెడ్‌ స్టేట్‌ కాం గ్రెస్‌ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుంచి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించడంతో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం వచ్చింది. నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి.  

దగ్గర చేస్తున్న సోషల్‌ మీడియా..

సోషల్‌ మీడియా పుణ్యమాని పలువురు స్నేహితులు ఒక్కటవుతున్నారు. ఎవరైనా ఒక్కరికి నంబర్‌ తెలిస్తే చాలు అందరినీ గ్రూపుగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నో ఏండ్ల స్నేహం మళ్లీ తెరపైకి వస్తున్నది. అదే వేదికగా చాలా మంది స్నేహితులు తిరిగి కలుసుకుంటున్నారు. గెట్‌ టు గెదర్‌ పార్టీలు, పూర్వ స్నేహితుల కలయికలు.. ఇలా జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వేదికగా వీటిని ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా స్నేహితులను ఒక్కటి చేయడం సోషల్‌ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్నదని చెప్పొచ్చు. 


logo