శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 19, 2020 , 03:03:56

పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం

పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పల్లె ప్రగతి స్ఫూర్తిగా  తీసుకుని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణపై మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని .. ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళికలు తయారు చేసుకుని అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని చెప్పారు. మూడు నెలల్లోగా అన్ని పట్టణాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లోగా విద్యుత్‌ సంబంధిత సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ ఘాటుగా హెచ్చరించారు. వార్డుల వారీగా ప్రణాళిక తయారు చేయాలని, ప్రతి పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కౌన్సిలర్లను కలుపుకుని.. జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రణాళికలు తయారు చేసి వార్డుల వారీగా నియామకమైన ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకాధికారి నియమించి ప్రతి వార్డును ఎక్స్‌రే తీయాలన్నారు. చెత్త, మురికినీటి శుభ్రత, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, రహదారిపై గుంతలు, గోతులు లేకుండా చూసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, ఓపెన్‌ జిమ్‌లు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, స్ట్రీట్‌ వెండర్లకు ప్రత్యేక స్థలం, ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. 

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కౌన్సిలర్లు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలు బతికి ఉండాలని.. పట్టణాలకు అవసరమయ్యే నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్త సేకరణకు బుట్టల పంపిణీ, చెత్త సేకరణకు వాహనాలు సమకూర్చుకోవాలని కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. పట్టణాలకు ప్రతి నెలా రూ.148కోట్ల నిధులు ఇస్తామని పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

జీవో నెంబరు 58, 59ద్వారా పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్ధీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. సమావేశంలో భాగంగా చైర్మన్లతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి నిర్వహించి.. వారి సందేహాలను నివృత్తి చేశారు.  సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు, ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్‌, గడ్డిగారి విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. logo