హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక పాఠశాలల్లోని ఒకటి, రెండు తరగతుల్లో నాలుగు సబ్జెక్టులు.. మూడు నుంచి ఐదు తరగతుల్లో ఐదు సబ్జెక్టులు ఒకే ఒక్క టీచర్ బోధిస్తున్నారు. ఇలాంటి సింగిల్ టీచర్ స్కూళ్లు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,001 ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఏకోపాధ్యాయ పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉన్నట్టు తేల్చింది.
దేశంలో అత్యధికంగా సింగిల్ టీచర్ స్కూళ్లున్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ 12,912 స్కూళ్లతో అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ పదో స్థానంలో ఉన్నట్టు తెలిపింది. జాతీయస్థాయిలో సింగిల్ టీచర్ స్కూళ్ల సంఖ్య 10 శాతముంటే.. మన రాష్ట్రంలో మాత్రం 20 శాతం ఉన్నట్టు స్పష్టంచేసింది. గత కొంతకాలంగా జాతీయంగా సింగిల్ టీచర్ స్కూళ్ల సంఖ్య తగ్గుతున్నట్టు చెప్పింది. 2022-23 నుంచి 2023-24కు వచ్చేసరికి ఈ స్కూళ్ల సంఖ్య 1.18 లక్షల నుంచి 1.10 లక్షలకు తగ్గిందని వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సోమవారం సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 249 చికున్ గున్యా కేసులు, 209 మలేరియా కేసులు, 4600 టైఫాయిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు మంత్రికి వివరించారు.
నిరుడుతో పోలిస్తే 2900 డెంగ్యూ కేసులు తకువగా నమోదయ్యాయని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ , మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటిలార్వ ఆపరేషన్ను విస్తృతం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యసిబ్బంది ఇంటింటిని సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.