ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరచడం, ఉపాధ్యాయులను ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత కావాలి. అయితే తెలంగాణ విద్యా శాఖ ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమాలు చూస్తుంటే.. అసలు లక్ష్యం పక్కకుపోయి ‘శిక్షణే లక్ష్యం’గా సాగుతున్నట్టు కనిపిస్తున్నది.
ఏడాది పొడవునా ఏదో ఒక శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చెయ్యడం అశాస్త్రీయం. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 24 రోజులుపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.. విద్యార్థులు అత్యంత కీలకమైన బోధనా సమయాన్ని కోల్పోవడమే. ఇది ఇప్పటి వరకు శిక్షణ అందించిన రోజులు మాత్రమే. ఇంకా విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఎన్ని రోజులు నిర్వహిస్తారో అనే ప్రశ్నలు ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
వేసవి సెలవుల్లోనే శిక్షణ పూర్తి చేయకుండా బడులు ప్రారంభమైన తర్వాత పదేపదే శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం అధికారుల ప్రణాళికా రాహిత్యమే. తెలంగాణలో 5 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అటువంటి పాఠశాలలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు శిక్షణకు వెళ్తే ఆరోజు పాఠశాలకు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వరంగంలో నిపుణులైన రిసోర్స్ పర్సన్స్ ఉన్నప్పటికీ, ప్రైవేట్ సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని పెంచడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల అనుభవాన్ని తక్కువ చేయడమే అవుతుంది. శిక్షణల పేరిట కార్పొరేట్ సంస్థల ముద్రను ప్రభుత్వ పాఠశాలలపై వేయడం ఎంతవరకు సమంజసం? అని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. బోధనకు ఆటంకంతోపాటు ప్రభుత్వ పాఠశాలల మనుగడకే ప్రమాదం వచ్చే నిర్ణయాలు విద్యాశాఖ అధికారులు తీసుకోవడం దారుణం. విద్యాశాఖను తన పరిధిలోనే పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ప్రైవేటు శిక్షణ సంస్థల ప్రమేయం పట్ల ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? అని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వీటికి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడాలే కానీ బోధనకు సంకెళ్లు వేసి విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఉండకూడదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ప్రయివేట్ సంస్థల ఒప్పందాలను పునరాలోచించి, సరైన ప్రణాళిక లేని శిక్షణ కార్యక్రమాల నుండి ఉపాధ్యాయులను విముక్తి చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య సాధ్యమవుతుంది.
-పల్లె నాగరాజు, 8500431793, టీపీటీఎఫ్ నాయకుడు