TG EAPCET | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీఎప్‌సెట్ సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల తొలిరోజే కరెంట్ కట్ కావడంతో ఓ సెంటర్లో పరీక్షకు అంతరాయం కలిగింది. విద్యార్థుల నుంచి అందిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్లో మొదటి సెషన్లో 20 నిమిషాలపాటు కరెంట్ కట్ అయ్యింది. దీంతో పరీక్ష నిలిచిపోయింది. ల్యాబ్‌కు సరఫరా అయ్యే విద్యుత్తు వైర్ తెగిపోయినట్టు గుర్తించి మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు. 20 నిమిషాలు అదనపు సమయమిచ్చి పరీక్ష కొనసాగించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్‌తో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు ముగుస్తాయి. ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 9,10,11 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి.
సోమవారం ప్రారంభమైన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో అగ్రికల్చర్, ఫార్మసీ(ఏఎం) విభాగానికి పరీక్షలు నిర్వహించారు. మొదటి సెషన్లో జీవశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, ఫిజిక్స్ ప్రశ్నలు కాస్త కఠినంగా ఉన్నట్టు విద్యార్థులు చెప్పారు. రెండో సెషన్లో జీవశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, ఫిజిక్స్ మధ్యస్తం నుంచి కఠినంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.
ఎప్‌సెట్ పరీక్షలకు తొలిరోజు 4,299 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 2,287, మధ్యాహ్నం 2,012 మంది చొప్పున డుమ్మా కొట్టారు. ఉదయం 92.46శాతం, మధ్యాహ్నం 93.35శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్ హైదరాబాద్‌లోని పలు సెంటర్లను పరిశీలించారు. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు, ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రొఫెసర్ బాలూనాయక్ తదితరులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు.
ఎప్‌సెట్ పరీక్షల్లో ఈసారి కొత్తగా మార్కుల డిస్ప్లే విధానాన్ని ప్రవేశపెట్టారు. పరీక్ష ముగిసిన వెంటనే సబ్జెక్టుల వారీగా మార్కులు తెరపై డిస్ప్లే అయ్యాయి. ఓ విద్యార్థి తనకు 130 మార్కులు వచ్చినట్టు చెప్పగా, మరో విద్యార్థి తనకు 128 మార్కులు వచ్చినట్టు చెప్పారు. అయితే ఇవి ప్రాథమిక కీ ఆధారంగా ఇచ్చిన మార్కులు మాత్రమే. వీటి ద్వారా విద్యార్థులు ఓ అంచనాకు రానుండగా, ఫైనల్ కీ ప్రకారమే తుది ఫలితాలు ప్రకటిస్తారు.