NEET UG Results | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ – యూజీ) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. శనివారం ఏ క్షణాన్నైనా ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. మే 4న జాతీయంగా ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల ముందు విడుదల చేసే ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం ఉదయం విడుదల చేసింది. దీంతో ఫలితాల విడుదల ఒక్కటే మిగిలింది. అయితే ఫైనల్ కీలో ఎన్టీఏ ఒక్క మార్పు చేసింది. ఫిజిక్స్ లో ఒక ప్రశ్న సమాధానంగా రెండు ఆప్షన్లను ఖరారు చేసింది. రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నా మార్కులేస్తారు.
రాష్ట్రం నుంచి 72వేల మంది
ఈ సారి నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గింది. ఈ సారి తెలంగాణ నుంచి 72,507 మంది అభ్యర్థులు రాశారు. నిరుడు 77వేలకు పైగా అభ్యర్థులు నీట్ – యూజీ పరీక్షలను రాయగా, ఈ సారి 5వేలు తగ్గారు. జాతీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిరుడు జాతీయంగా 23లక్షలకుపైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా, ఈ సారి 20లక్షల మంది రాశారు. తాజా అంచనాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థి 700 మార్కులకు 690కి పైగా మార్కులు సాధించారు. ఇక తెలంగాణ నుంచి 668 టాప్ మార్కులుగా తెలిసింది. రాష్ట్రంలో 33 ప్రభుత్వ మెడికల్, రెండు డీమ్డ్, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తంగా 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నట్లు సమాచారం.