హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడనున్నది. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో పోలింగ్ ఉండే అవకాశం ఉన్నది. సక్రాంతి సెలవులు ముగియగానే ఇంటర్లో పరీక్షల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నెలలోనే ఇంటర్ విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు ఉన్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగబోతున్నాయి. ఇవి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు రానున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 25 నుంచి 18 వరకు ఇంటర్ వార్షిక(థియరీ) పరీక్షలు ఉన్నాయి. పరీక్షల సమయంలోనే ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. నెల రోజులపాటు మూల్యాంకనం జరుగుతుంది. ఇటు పరీక్షలు.. అటు ఎన్నికలు ఉండటంతో ఇంటర్‌బోర్డు అధికారుల్లో కలవరం మొదలైంది.
ఇంటర్ పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, లెక్చరర్లకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇంటర్‌బోర్డు కోరింది. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించొద్దని బోర్డు విజ్ఞప్తిచేసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ సెక్టార్(గురుకులాలు) కాలేజీల లెక్చరర్లు, సిబ్బందికి ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇటీవలే ఇంటర్‌బోర్డు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న 1,844 మంది బోధనేతర, 7,110 మంది బోధన సిబ్బంది, ప్రభుత్వ సెక్టార్ కాలేజీల్లో 759 మంది బోధనేతర, 12,131 మంది బోధన సిబ్బంది చొప్పున మొత్తంగా 21,844 మంది పరీక్షల విధుల్లో ఉంటారని పేర్కొన్నది. పరీక్షల సమయంలో సమన్వయం, పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణ వంటి విధుల్లో లెక్చరర్లు, సిబ్బంది నిమగ్నమై ఉంటారని, వీరిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తిచేసింది.