DOST | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. దోస్త్ లో సీటు పొందిన విద్యార్ధులు తప్పనిసరిగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే. లేదంటే వచ్చిన సీటును చేజేతులా చేజార్చుకున్నట్లే. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ విడుతలో 43,568 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరే కాకుండా మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది బెటర్మెంట్ కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని సీట్లు దక్కించుకున్నారు. వీరంతా ఈ నెల 18లోగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. గడువులోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే వచ్చిన సీటును కోల్పోయినట్లే. ఆయా సీటును రద్దుచేసి, మరో విడతకు బదలాయిస్తారు.
చేజార్చుకున్న 19 వేల మంది
దోస్త్ మొదటి విడతలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని కారణంగా 19వేల మంది విద్యార్థులు సీట్లను కోల్పోయారు. ఒక్క కారణంతో అంత మంది సీట్లను కోల్పోయారు. దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 60,428 మంది సీట్లను దక్కించుకున్నారు. అయితే ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు ముగిసే వరకు కేవలం 41,285 మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేయనివారంతా వచ్చిన సీట్లను కోల్పోయారు. దీంతో కథ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడతలో సీట్లు దక్కించుకున్న 43వేల మంది గడువులోగా ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సూచించారు. లేదంటే వీరు కూడా సీట్లను కోల్పోవాల్సి ఉంటుందని చెప్పారు.