హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలో పారామెడికల్ పోస్టుల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది అభ్యర్థులు పారామెడికల్ పోస్టుల కోసం పరీక్షలు రాసి 7 నెలలుగా మెరిట్ లిస్ట్, అపాయింట్మెం ట్ ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్లు 2,322, ల్యాబ్ టెక్నిషియన్లు గ్రేడ్-2(1,284), ఫార్మాసిస్టు గ్రేడ్-2 (732) పోస్టులకు, ఎంపీహెచ్ఏ (ఫిమేల్) 1,931 పోస్టులు మొత్తం 6,269 పోస్టులకు అభర్థులు పరీక్షలు రాశారు. ల్యాబ్ టెక్నిషియన్ల పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారులు ఇవ్వగా.. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపడానికి బోర్డు వారం రోజులపాటు గడువు విధించింది.
నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ఎంపీహెచ్ఏ(ఫిమేల్) ‘కీ’ విడుదల సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ పాయింట్లు కలిపి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ఎంహెచ్ఎస్ఆర్బీ వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో 2022 డిసెంబర్లో 7,094 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. గతేడాది జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి 6,956 మందికి నియామక పత్రాలు అందజేశారు. అయితే ప్రొవిజనల్, ఫైనల్ మెరిట్ లిస్టులు విడుదల చేసి నియామక ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే చేపట్టాలని కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ల్యాబ్ టెక్నిషియన్లకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు గత శుక్రవారం ఇచ్చామని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తామని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ బోర్డు సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి తెలిపారు.