హైదరాబాద్, జూన్ 2: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో (JEE Advanced Results) ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులు సత్తాచాటారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్‌గా వంగాల అజయ్‌రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా డీ. జ్ఞాన రుత్విక్ సాయి నిలిచారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 360 మార్కులకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.
ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి రజిత్ గుప్తా 332 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్ విద్యార్థి దేవదత్ మాజీ ఆలిండియా మహిళా టాపర్‌గా నిలిచాడు. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319 మార్కులతో ఆలిండియా 9వ ర్యాంకుతో పాటు హైదరాబాద్ జోన్ టాపర్‌గా నిలిచాడు. ఇదే జోన్ విద్యార్థి వడ్లమూడి లోకేష్ 317 మార్కులలో ఆలిండియా 10వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అనిరుద్‌రెడ్డి ఆలిండియా 20, కే రసజ్ఞ హైదరాబాద్ జోన్ మహిళా టాపర్తోపాటు, ఆలిండియా 78వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.
ఈ సారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 1. 80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 54,378 మంది క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారిలో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. 44వేల మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే, అమ్మాయిలు కేవలం 9,404 మంది మాత్రమే అర్హత సాధించారు. అయితే ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. మొత్తం ఏడు జోన్లు ఉండగా, హైదరాబాద్ జోన్ నుంఇ ఈ సారి రికార్డుస్థాయిలో 12,946 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలున్నాయి. అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10, టాప్ 100లోను మనోళ్లు సత్తాచాటారు. మిగతా జోన్లతో పోల్చితే మన దగ్గరి నుంచే టాప్ -500లో అత్యధికులు నిలిచారు. టాప్ 10లో ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి ఇద్దరు విద్యార్థులున్నారు. టాప్ 100లో 23 మంది, టాప్ 200లో 57 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే కావడం గమనార్హం. టాప్ 300లో 78 మంది, టాప్ 400లో 116, టాప్ 500లో 136 ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులున్నారు.
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. మొత్తం ఆరు విడుతల్లో సీట్లను భర్తీచేస్తారు. మంగళవారం నుంచే మొదటి విడుద ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 14న మొదటి మొదటి రౌండ్,21న రెండో రౌండ్, 28న మూడో రౌండ్, జూలై 4న నాలుగో రౌండ్, జూలై 10న ఐదో రౌండ్, జూలై 16న ఫైనల్ రౌండ్ సీట్లను కేటాయిస్తారు. ఈ సారి ఐఐటీల్లో 17,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ఐటీల్లో 24,229, ట్రిపుల్ ఐటీల్లో 8,546, గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో 9,402 చొప్పున సీట్లున్నాయి.