BRS | జహీరాబాద్, ఏప్రిల్ 16 : ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ జహీరాబాద్ మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత నామ రవి కిరణ్ ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక ఆలయానికి పాదయాత్ర చేపట్టారు. బుధవారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని తెల్లవారుజామున జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిర్ ఆలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేజింతల్ సిద్ధి వినాయక ఆలయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయానికి చేరుకున్న అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఎలాంటి ఆటంకాలు కలవకుండా బీఆర్ఎస్ రజతోత్సవ సభ దిగ్విజయం అయ్యేలా కరుణించాలని కోరుతూ స్వామివారిని మొక్కుకున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ నామరవి కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.