Bhuvanagiri | యాదాద్రి భువనగిరి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన యూత్ కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయా రు. అధికారం చేతిలో ఉన్నదని గూండాగిరీ ప్రదర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై శనివారం దాడికి తెగబడ్డారు. పోలీసుల ముందే అరాచకానికి దిగి విధ్వంసం సృష్టించారు. ఆఫీసులోని కుర్చీలు, అద్దాలు, టీవీ పగులగొట్టారు. దాడి ఘటనను బీఆర్ఎస్తోపాటు పలు రాజకీయ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలతో భువనగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కా ర్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో విఫలమవడంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు పక్కనే ఉన్న ఐటీఐ కాలేజీ వద్ద కాపు కాశారు. ప్రెస్‌మీట్ పూర్తయ్యాక బీఆర్ఎస్ నేతలందరూ వెళ్లిపోయాక యూత్ కాంగ్రెస్ నేతలు రంగప్రవేశం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ప్రణాళిక ప్రకారం లోపలికి ప్రవేశిస్తూనే కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. కుర్చీలను విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. అంతటితో ఆగకుండా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను విరగ్గొట్టారు. ఫ్లెక్సీలను చింపేశారు. లోపలి రూమ్‌లోకి వెళ్లి టీవీని పగులగొట్టారు. పార్టీ కార్యాలయం ముందు బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. దాడి గురించి సమాచారం అందుకున్న పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నేత క్యామ మల్లేశ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. దాడి జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి గురించి పోలీసులకు ముందే తెలిసినట్టు సమాచారం. ఘటనకు ముందు ఓ ఎస్ఐతోపాటు కొందరు కానిస్టేబుళ్లు పార్టీ కార్యాలయానికి వచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేసే అవకాశం ఉందని అక్కడే ఉన్న తమకు పోలీసులు చెప్పారని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. తొలుత ముగ్గురు పోలీసులు మాత్రమే వచ్చారని, ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చారని పేర్కొంటున్నారు. అయితే పోలీసులు అక్కడ ఉండగానే, వారి కండ్లముందే దాడి జరగడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందే సమాచారం ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకులను పార్టీ కార్యాలయం వరకు పోలీసులు ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
యూత్ కాంగ్రెస్ విధ్వంసంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైళ్ల శేఖర్‌రెడ్డి నేతృత్వంలో భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. స్టేషన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పెద్దఎత్తున ర్యాలీగా ప్రిన్స్ కార్నర్ వద్దకు తరలివెళ్లారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు.. కాంగ్రెస్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేశారు.
భువనగిరి అర్బన్, జనవరి 11: భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసిన దాడికి నిరసనగా ఆదివారం మహాధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 10 గంటలకు మహాధర్నా ఉంటుందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు జనగాం పాండు శనివారం తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
కాంగ్రెస్ పాలన దాడులను ప్రోత్సహించేలా కొనసాగుతున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమై ఏడాదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారని, ఇప్పుడు దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికావని హితవు పలికారు. కాంగ్రెస్ గూండాలతో పోలీసులు కలిసి దాడులకు పాల్పడుతున్నారని చెప్పడానికి ఇది అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులను ఉపేక్షించేది లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అల్లర్లు, అరాచకాలను ప్రోత్సహించే తత్వం ఉన్న వ్యక్తి అని దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌పై ప్రజలే దాడులకు దిగే పరిస్థితి వస్తుందని తెలిపారు.
ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వస్తున్నదని గ్రహించిన అధికార పార్టీ గూం డాలు బీఆర్ ఎస్ ఆఫీస్‌పై దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మండిపడ్డారు.బీఆర్ఎస్ కా ర్యాలయానికి పోలీసులు ముందే వచ్చా రని, ఆ తర్వాతే కాంగ్రెస్ గూండాలు వచ్చారని తెలిపారు. గూండాలు విధ్వం సం చేస్తుంటే పోలీసులు చోద్యం చూశా రని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా అని నిలదీశారు.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): యాదా ద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి.. హింసను ప్రోత్సహిస్తున్నారా? అని నిలదీశారు.
పార్టీ కార్యాలయాలపై దాడులు సమర్థనీయం కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామిక చర్యలకు వెంటనే స్వస్తి పలకాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు.
కాంగ్రెస్ నాయకుల దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈ శ్వర్ ఖండించారు. ప్రజల పక్షాన ప్రశ్ని స్తే దాడి చేస్తారా? అ ని నిలదీశారు. దాడి ఓ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ నా యకులు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పెద్ద ల ప్రోత్సాహంతోనే బీఆర్ఎస్పై దాడు లు జరుగుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆటవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ గూం డాలు దాడి హేయనీయమని మాజీ ఎ మ్మెల్యే బాల్క సు మన్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ యనే ప్రోత్సహిస్తున్నట్టు భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యమంటే హింసా, ధ్వంసమేనా? అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గూండాల ఆటవిక దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. దాడులు మంచి సంస్కృతి కాదని హితవు పలికారు.
బీఆర్ఎస్ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చే యించారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఘటన గురించి పోలీసులకు ముందే తెలిసినా అడ్డుకోలేదని తెలిపారు. రౌడీయిజాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి చేసిన కాం గ్రెస్ భవిష్యత్తులో తగిన మూల్యం చె ల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తామంటే ప్రతిదాడులు కూడా తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ పె ద్దలు దాడులు చే యించారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి అనైతికమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఉపేంద్ర విమర్శించారు. హామీలు అ మలు చేయాలని బీఆర్ఎస్ నేతలు అడిగితే పార్టీ కార్యాలయంపై దాడి చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో డైవర్షన్ డ్రామాలు తప్పా, ఉద్దరించేందేమీలేదని దుయ్యబట్టారు. ప్రజాపాలన ముసుగులో హింసను ప్రేరేపించడం దుర్మార్గమని మండిపడ్డారు.
ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమేనా? అ ని తెలంగాణ స ర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కర్ విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే కార్యాలయంపై దాడిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూడడం బాధాకరమని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయని బీఆర్ఎస్ నేత కురవ విజయ్ విమర్శించారు. హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు అడిగితే దాడులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. బాధ్యులపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కక్షలు, కుతంత్రాలు తప్పా సాధించిందేమీలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ కా ర్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ పా ర్టీకి తగిన మూ ల్యం తప్పదని బీఆర్ఎస్ నేత రూప్సింగ్ హెచ్చరించారు. దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను పక్కనబెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని కాంగ్రెస్ సర్కార్‌కు హితవు పలికారు. ఇలాంటి దాడులను విడనాడాలని కోరారు.
‘బీఆర్ఎస్ ఆఫీసు పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమని, దాడులు చేయడం సరికాదని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హకులను అందరూ గౌరవించాలని, భౌతిక దాడులకు పూనుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇలాంటివి మళ్లీ జరుగకుండా చూ సుకోవాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
రాష్ట్రంలో విధ్వం స పాలన కొనసాగుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రె స్ దాడి దుర్మార్గమని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నిత్యం హింసను ప్రోత్సహించేలా మాట్లాడుతుండటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆయన బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొనారు.
‘బీఆర్ఎస్ ఆఫీస్‌ను ధ్వంసం చేసి, దురహంకారంతో వ్యవహరించడం సరికాదని, ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతమైతే తరిమికొడతామని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
పాలన చేతగాకే కాంగ్రెస్ పార్టీ దాడులకు తెగబడుతున్నదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాల దాడిని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తున్నదని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు.
ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతామని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజుయాదవ్ స్పష్టంచేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రతిపక్ష పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ గూండాలకే రక్షణ కల్పిస్తుందా? అని ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. తాము దాడులు మొదలుపెడితే కాంగ్రెస్ నేతలు ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడిచేసిన సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటోని తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు.
భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటనని బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ విమర్శించారు. పార్టీ కార్యాలయ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. రేవంత్‌రెడ్డే స్వయంగా అనేకసార్లు ప్రతిపక్ష నేతలపై దుర్భాషలాడారని, ఆయన వైఖరిని బట్టే కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. దొంగ దాడులు చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.