కురవి, జూన్ 18 : భూ వివాదంలో సొంత తమ్ముళ్ల చేతిలో ఓ అన్న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు రెండు భార్యలు. మొదటి భార్య మాణిక్యమ్మకు ఒక కొడుకు కృష్ణ (43), ముగ్గురు కుమార్తెలు ప్రమీల, రమణ, వినోద రెండో భార్య నర్సమ్మకు ఇద్దరు కొడుకులు నరేశ్, మహేశ్ ఉన్నారు. లింగయ్యకు గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని పదహారు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. కొన్నేళ్ల కిందట లింగయ్య కొంత భూమిని కొడుకులకు, రమణ అనే కుమార్తెకు పట్టా చేశాడు. మిగతా భూమిని రోడ్డు వైపులా ఉండేలా పంపకం చేయడంతో.. రెండో భార్య కొడుకులు తండ్రితో తరచూ గొడవ పడుతూ వచ్చారు.
ఈ వివాదం పలు పంచాయతీలకూ, పోలీస్ స్టేషన్లకు వెళ్లినా పరిష్కారం కాలేదు. మృతుడు కృష్ణ భార్య సత్యవతి, కుమారుడు మిన్ను, కుమార్తెతో కలిసి హైదరాబాద్లో జీవిస్తున్నారు. కృష్ణ హైదరాబాద్ నుంచి మంగళవారం సీరోలుకు వచ్చారు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమివద్దకు వెళ్లారు. వ్యవసాయ భూమి వద్ధ ముందే నరేశ్, మహేశ్, వారి భార్యలు, నరేశ్ బావమరిది వీరన్న కలిసి ఘర్షణకు దిగారు. గొడవ జరుగుతుండగా విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య అక్కడకు చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేశారు. గొడవ ముదిరిపోవడంతో నరేశ్ ముందుగా తెచ్చుకున్న కత్తితో అన్నయ్య కృష్ణ మెడపై దారుణంగా నరికాడు.
తండ్రి లింగయ్యను ఆపే ప్రయత్నంలో గాయపరిచారు. కృష్ణ అక్కడికక్కడే రక్తపు మడుగులో మృతి చెందారు. గాయపడిన లింగయ్యను మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తమ్ముడు నరేశ్ తన అన్న కృష్ణను తానే చంపానని పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఇదే రోజు కృష్ణ కుమారుడు మిన్ను పుట్టిన రోజు కాగా.. కుటుంబం పుట్టినరోజు వేడుకలు చేసేందుకు సిద్ధమవుతుండగానే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం సీరోలు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.