Sajjala Ramakrishna Reddy | రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ పాలనలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయని వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తమ స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థుల గొంతుక వినిపించకూడదని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నారా లోకేశ్ నేతృత్వంలో విధ్వంస పాలన జరుగుతుందని విమర్శించారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా తమకు ఇష్టం వచ్చినవారిని ఇష్టం వచ్చినన్ని రోజులు జైళ్లో ఉంచుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయిందని సజ్జల విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయని తెలిపారు. మ్యానిఫెస్టోలు అమలు చేయడంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వమే నేర స్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వంలో లేని పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయం డొల్లగా మారిపోయిందని అన్నారు. చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపంలో వెళ్లిపోయిందన్నారు. మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుతో వికృత చేష్టలు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయాయని మండిపడ్డారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చూపించిన వ్యక్తిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కొక్క ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఒక్కొక్క వైసీపీ నేతను టార్గెట్ చేసి అరెస్టులు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ల అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు నారా వారి కొత్త చట్టంలా మారిందన్నారు. జోగి రమేశ్ ఇంట్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డెస్క్‌లు దొరికాయని చెబుతున్నారని అన్నారు. చట్టాన్ని పూర్తిగా మిస్ యూజ్ చేస్తున్నారని తెలిపారు. నేరం చేయకున్నా శిక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో నకిలీ మద్యం నడుస్తూనే ఉందన్నారు.