Warts | మన శరీరంపై పలు భాగాల్లో చాలా మందికి పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. చర్మం కింద మందంగా ఉండే భాగంలో కొల్లాజెన్, ఫైబర్ పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడుతాయి. పులిపిర్లు ప్రమాదకరమైనవి కావు. కానీ పులిపిర్లు ఉన్నవారు ఆభరణాలు, దుస్తులను ధరిస్తే అవి పులిపిర్లను తాకితే ఇబ్బందిగా ఉంటుంది. నొప్పి, దురద, మంట కలుగుతాయి. సాధారణంగా చాలా మందికి మెడకు ఏదైనా ఒక వైపు లేదా రెండు వైపులా పులిపిర్లు వస్తాయి. అలాగే చంకలు, వక్షోజాలు, గజ్జలు, కనురెప్పలు, మోచేతులు వంటి భాగాలపై కూడా కొందరికి పులిపిర్లు ఏర్పడుతుంటాయి. పులిపిర్లు అసలు ఎలా వస్తాయన్న విషయంపై ఇప్పటికీ సరైన వివరాలను ఎవరూ వెల్లడించలేదు. కానీ బరువు అధికంగా ఉండడం, థైరాయిడ్, డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల సమస్యలు ఉన్నవారికి పులిపిర్లు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల పులిపిర్లను చాలా సులభంగా తొలగించుకోవచ్చు.
పులిపిర్లను తొలగించేందుకు టీ ట్రీ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి పులిపిర్లను తొలగిపోయేలా చేస్తాయి. ఈ ఆయిల్‌ను అప్లై చేయడానికి ముందు పులిపిర్లు ఉన్న చోట బాగా కడిగి శుభ్రం చేయాలి. తరువాత ఆయిల్‌ను సున్నితంగా మర్దనా చేయాల్సి ఉంటుంది. దానిపై ఒక కాటన్ బ్యాండేజ్ వేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్‌ను ముంచి దాన్ని పులిపిర్లపై ఉంచి కట్టు కట్టుకోవాలి. రోజుకు 3 నుంచి 4 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా పులిపిర్లను తొలగించుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ యాసిడ్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక పులిపిర్లను సులభంగా తొలగిస్తుంది.
పులిపిర్లు పోయేందుకు గాను అరటి పండ్ల తొక్కలను సైతం ఉపయోగించవచ్చు. అరటి పండు తొక్క లోపలి భాగంలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని రాస్తుంటే పులిపిర్లు రాలిపోతాయి. అరటి పండు తొక్కను తీసుకుని దాన్ని పులిపిర్లపై వేసి కట్టులా కూడా కట్టుకోవచ్చు. దానిపై అవసరం అయితే పట్టీ లేదా బ్యాండేజ్ వంటివి వేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి ఉదయం తీసేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. పులిపిర్లు రాలిపోతాయి. అలాగే విటమిన్ ఇ కూడా ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మార్కెట్లో లభించే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తెచ్చి లోపలి ద్రవాన్ని పులిపిర్లపై రాయాలి. ఇలా రోజూ చేస్తుంటే కొద్ది రోజులకు సమస్య తగ్గిపోతుంది.
రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దంచి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లపై పెట్టి మీద పట్టీ లేదా బ్యాండేజ్ వేయాలి. ఇలా రాత్రి పూట చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా పులిపిర్లు తొలగిపోతాయి. అలాగే అల్లం కూడా ఈ సమస్యకు బాగానే పనిచేస్తుంది. కొద్దిగా అల్లాన్ని తీసుకుని దంచి మెత్తని పేస్ట్‌లా మార్చి దాన్ని పులిపిర్లపై రాయాలి. మరుసటి రోజు కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తే పులిపిర్లను సులభంగా తొలగించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కళ్లపై పులిపిర్లు ఉంటే మాత్రం ఈ చిట్కాలను పాటించకూడదు. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.