అమరావతి : ఏపీ వైసీపీ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy) కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. నారా లోకేష్( Nara Lokesh) నేతృత్వంలో విధ్వంసపాలన నడుస్తుందని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలనలో వ్యవస్థలన్నీ నీరుగారిపోతున్నాయని ఆరోపించారు. కేవలం వాంగ్మూలాల ఆధారంగా తమకు ఇష్టం వచ్చినవారిని జైళ్లో పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టారని అన్నారు. జోగి రమేష్ ఇంట్లో పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాలు టీడీపీ నాయకుల కనుసన్నలలో జోరుగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి నాయకులే అక్రమాలకు పాల్పడుతూ ఆ నెపాన్ని వైసీపీ నాయకులపై వేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారని వెల్లడించారు.
తిరుపతి, సింహాచలం ఆలయాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలు మరువకముందే కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలన అంతా డొల్లతనమేనని విమర్శించారు.