తాండూర్ : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం, పత్తి కొనుగోలు చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak ) అన్నారు. సోమవారం తాండూర్ ( Tandur ) మండల కేంద్రంలోని మహేశ్వరి కాటన్స్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు (Cotton Purchase Centre )కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.

అధికారులు రైతులకు లబ్ధి చేకూరేలా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 2025- 26 సంవత్సరంలో మద్దతు ధర క్రింద సీసీఐకు పత్తి విక్రయిం చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని, స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. ఆధార్ నంబర్కుఅనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలో మాత్రమే చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు. ఆధార్ కార్డులో ఫోటో కలిగి ఉన్న రైతు మాత్రమే తక్పట్టిలో ఫోటో దిగవలసి ఉంటుందని తెలిపారు.
జిల్లాలో ఇటీవల వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులలో పత్తి ఉత్పత్తి తక్కువ అయిందని పేర్కొన్నారు. దళారులు కొనుగోలు చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి అనుమతించ వద్దని తెలిపారు. పత్తి కొనుగోలుతో పాటు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో చేపట్టానున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, తహసీల్దార్ జ్యోత్స్న, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.