యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ముక్కోటి దేవతలసాక్షిగా తిరుకల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి నయనానందకరంగా సాగింది. అలంకార నరసింహస్వామి వారిని అశ్వవాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదపండితులు, అధికారులు స్వామి, అమ్మవార్ల వైపు రెండు జట్లుగా ఎదుర్కోలు తంతు నిర్వహించారు. అర్చక బృందం స్వామివారి మహిమలు, భక్తజనరక్షణలు వివరిస్తూ ఆసక్తికరంగా వాదాలు జరిపారు.
స్వామివారు ఉదయం 9 గంటలకు జగన్మోహిని రూపంలో తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ముఖ్య ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 9.30 గంటలకు అంగరంగవైభవంగా జరుపనున్నారు. మండపం ఎదురుగా వీవీఐపీలు, భక్తులకు ప్రత్యేకమైన బారికేడ్లతో ఏర్పాట్లు పూర్తిచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరుకానున్నారు