Yadagirigutta | యాదగిరిగుట్ట, అక్టోబర్16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట కొండపైన ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 21న నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షించి కల్తీ లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తేమ, ఓలేయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు పరిమితంగా ఉన్నట్టు గుర్తించారని చెప్పారు. యాదగిరిగుట్ట ప్రసాదాలతోపాటు స్వామివారి కైంకర్యాలకు 40 ఏండ్ల నుంచి మదర్ డెయిరీ తయారు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నట్టు ఈవో తెలిపారు.
టెండర్ ప్రకారం కిలోకు రూ.609 చెల్లిస్తున్నట్టు వివరించారు. లడ్డూ ప్రసాదంతోపాటు స్వామివారి పూజలకు నిత్యం వెయ్యి కిలోల నెయ్యి వినియోగిస్తున్నామని, స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో తేమ, ప్రీ ఫ్యాటీయాడ్, ఓలేయిక్ యాసిడ్ పరిమితి స్థాయిలో ఉండటంతో సింథటిక్ ఫుడ్ కలర్ నెగెటివ్గానే కనిపించినట్టు రాష్ట్ర ఆహార ప్రయోగశాల ఆహార విశ్లేషకురాలు కే వాణి ధ్రువీకరించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐ మాన్యువల్ పద్ధతి కింద ఆహారాలు, పాలు, పాల ఉత్పత్తుల విశ్లేషణ ప్రకారం నెయ్యిని పరీక్షించినట్టు వెల్లడించారు. కాగా.. స్వామివారి ప్రసాదాలు, కైంకర్యాలకు మదర్ డెయిరీకి బదులు విజయ డెయిరీ నెయ్యిని వినియోగించాలని దేవస్థానానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ఈవో భాస్కర్రావు తెలిపారు. టెండర్ ప్రకారం 2025 డిసెంబర్ 31 వరకు మదర్ డెయిరీనే దేవస్థానానికి నెయ్యిని పంపిణీ చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని తప్పించి విజయ డెయిరీకి టెండర్ ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.