రామన్నపేట, ఫిబ్రవరి 10 : ప్రతి ఒక్కరూ భక్తిభావాలను పెంపొందించుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎన్నారం గ్రామపంచాయతీ పరిధి నాగులంచగూడెంలో అభయాంజనేయస్వామి దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపకులు కారంపూడి అనంతాచార్యుల బృందం ఆధ్వర్యంలో జల, ధాన్య, పుష్పాదివాస పూజలు చేశారు. యంత్ర స్థాపన చేసి విగ్రహ ప్రతిష్ఠాపన గావించారు. హోమాలు నిర్వహించి ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఆలయం వద్ద రూ.5లక్షలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయించారు. ఎన్నారం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం కోసం త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మెట్టు మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఏనుగు పుష్పావెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, కార్యదర్శి పోచబోయిన మల్లేశం, ఆలయ చైర్మన్ వెలగపూడి లక్ష్మీకాంత్‌రావు, ప్రధాన కార్యదర్శి పనకంటి భాస్కర్‌రావు, నాయకులు భక్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల పూజలు..
ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో నలగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారిని ఆశీర్వదించారు. వారి వెంట నాయకులు గంగుల రాజిరెడ్డి, పూస బాలకిషన్, మడూరి జ్యోతీప్రభాకర్, చిల్లర కైలాసం, ఎండీ అక్రం, కక్కిరేణి విజయ్ ఉన్నారు.