సిటీబ్యూరో, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ) : ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో కీలకమైన చారిత్రక కట్టడాల విషయంలో వివాదం ఇంకా తొలగలేదు. తాజాగా మెట్రో సంస్థను చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, వాటి స్థితిగతులపై సమగ్ర నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. వారసత్వ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించాలని స్పష్టం చేసింది. దీంతో ఒక్కో కట్టడం వివరాలను సేకరించి కోర్టుకు అందజేయాల్సి ఉంది. రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట మార్గంలో నిర్మిస్తున్న మెట్రో మార్గం ఇప్పటికీ వివాదాలను ఎదుర్కొంటున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ యాక్ట్‌కు అనుగుణంగా నిర్మాణాల విషయంలో జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా గుర్తించిన చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది.
హెరిటేజ్ నిర్మాణాలే కీలకం…
ఈ ప్రాజెక్టు విషయంలో హెరిటేజ్, మతపరమైన కట్టడాలే కీలకంగా ఉన్నాయి. మొదటి నుంచి,తాజాగా జరుగుతున్న కూల్చివేతల వరకు వీటి ద్వారా పనులకు అంతరాయం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ మెట్రో సంస్థ హెరిటేజ్, పురాతన కట్టడాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతూనే కోర్టును ఆశ్రయించినట్లుగా ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, రాష్ట్ర హెరిటేజ్ శాఖ సూచనలను పాటించకుండానే,నేరుగా భూసేకరణ పేరిట కూల్చేందుకు మెట్రో సంస్థ ఏర్పాట్లు చేసుకోవడంతోనే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెబుతున్నారు. దీంతో ఓల్డ్ సిటీ మెట్రోపై నీలినీడలు కమ్ముకున్నాయి.