హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. సీట్లు పెంచిన అధికారులు వెబ్ ఆప్షన్ల నమోదు గడువును మాత్రం పెంచలేదు. దీంతో విద్యార్థులు తిప్పలు పడాల్సి వచ్చింది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఇప్పటికే ఒకసారి వెబ్ ఆప్షన్లు నమోదుచేసిన విద్యార్థులు శని, ఆదివారాల్లో మళ్లీ ఆప్షన్లు మార్చుకోవాల్సి వచ్చింది. తాజాగా బీటెక్ కోర్సుల్లో 9,433 సీట్లు పెరిగాయి. ఒక్క కన్వీనర్ కోటాలోనే 7,867 సీట్లు పెరిగాయి. మొదటి విడతలో 83,054 సీట్లకు 77,561 మంది సీట్లు దక్కించుకోగా 59,980 మంది విద్యార్థులు మాత్రమే రిపోర్ట్చేసి, అడ్మిషన్లు పొందారు.
మొదటి విడతలో 5,493 సీట్లు ఖాళీగా ఉండగా, ఇక సీటు వచ్చినా రిపోర్ట్ చేయకపోవడంతో మరో 17,581 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్లో శనివారం వరకు 23,074 సీట్లే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ సీట్లకే వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. కానీ శనివారం సాయంత్రం మరో 7,867 కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సీఎస్ఈ సీట్లు ఉండగా, పేరొందిన ప్రముఖ కాలేజీల్లోనూ సీట్లు అందుబాటులోకి వచ్చా యి. ఈ కొత్త సీట్లతో విద్యార్థుల్లో ఆశలు చిగురించా యి. ఆదివారం ఒక్క రోజే ఉండటంతో మళ్లీ ఆప్షన్ల నమోదుకు కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఒక్కరోజే ఉండటంతో టెన్షన్ పడ్డారు. కంగారులో ఆప్షన్లు నమోదుచేశారు. రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఆదివారంతో ముగిసింది. 30న సీట్లు కేటాయిస్తారు.