WPL : మహిళల ప్రిమియర్ లీగ్ వేలం మరో మూడు రోజుల్లో జరగనుంది. బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు 1525మంది మహిళా క్రికెటర్లు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. అయితే వీళ్లలో 409 మంది మాత్రమే వేలానికి అర్హత సాధించారు. వీళ్లలో 246 మంది భారత క్రికటెర్లు, 163మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ప్రతి జట్టు 12 మంది భారత క్రికెటర్లను, ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌ను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. మొత్తం 90 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ వేలంలో అత్యధిక ధర పలికే ప్లేయర్స్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మతో పాటు మరికొంత మందికి భారీ ధర పలకనున్నారు. వాళ్లు ఎవరంటే..?
భారత జట్టులో కీలకమైన స్మృతి మంధానా డబ్ల్యూపీఎల్ వేలంలో అందరికంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. ఈ స్టార్ ప్లేయర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. టీ20ల్లో ఇప్పటి వరకు 2,651 రన్స్ చేసింది. 25కు పైగ సగటుతో 120 స్ట్రయిక్ రేటుతో ఆడడం ఈమె స్పెషాలిటీ. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కోసం వేలంలో పోటీ నెలకొననుంది.
విదేశీ క్రికెటర్లలో కొందరు వేలంలో అత్యధిక ధర పలికే అవకాశం ఉంది. వాళ్లు ఎవరంటే..? ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎలిసే పెర్రీ, అమేలియ కెర్ (న్యూజిలాండ్), అలిస్సా హేలీ (ఆస్ట్రేలియా), నటాలీ సివర్ (ఇంగ్లండ్), డియేంద్ర డాటిన్ (వెస్టిండీస్), మరిజానె కప్ (దక్షిణాఫ్రికా), సోఫీ డెవినె (న్యూజిలాండ్) లకు వేలంలో భారీ ధర దక్కే అవకాశం ఉంది.