Wholesale inflation | దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరగా… అంతకు ముందు నెల మే మాసంలో 2.61శాతంగా ఉన్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 1.26 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. టోకు ధరల సూచీ (WPI) ఆధారంగా జూన్లో ద్రవ్యోల్బణం 3.36 శాతంగా ఉందని, ఈ నెలలో ధరలతో ద్రవ్యోల్బణం సైతం పెరిగిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తి, ముడి చమురు, పెట్రోల్, సహజ వాయువు, ఇతర వస్తువుల పెరుగదలతో పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో 10.87శాతం పెరగ్గా.. మేలో 9.82శాతంగా ఉన్నది. కూరగాయల ద్రవ్యోల్బణం జూన్లో 38.76శాతంగా ఉంటే.. మేలో 32.42 శాతంగా నమోదైంది. ఉల్లి ద్రవ్యోల్బణం 93.35 శాతం కాగా.. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జూన్లో 21.64 శాతంగా నమోదైంది. ఇంధనం, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం మే నెలలో 1.35 శాతం కంటే కొంచెం తక్కువగా 1.03 శాతంగా ఉన్నది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్లో 1.43 శాతంగా ఉంది. మేలో 0.78 శాతం కంటే ఎక్కువ. ఇది మాత్రమే కాదు, జూన్లో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)లో సైతం పెరుగుదల నమోదైంది. నాలుగు నెలల్లో గరిష్ఠ స్థాయి 5.08శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరల పెరుగుదల సీపీఐపై కూడా ప్రభావం చూపిందని భావిస్తున్నారు.