కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిపడిన వర్క్ ఫ్రం హోం విధానం.. ఇకపై కొన్ని సంస్థల ఉద్యోగులకు ఎప్పటికీ అందుబాటులో ఉండనున్నది. ఉదయం లేవగానే ఉరుకుల, పరుగుల జీవనానికి అలవాటైన సగటు ఉద్యోగి జీవితంలో ఇంటి నుంచే పనిచేసే అవకాశం.. పెద్ద మార్పుల్నే తెచ్చింది. బాస్‌తో ఉదయపు సమావేశానికి కేవలం 5 నిమిషాల ముందు నిద్ర లేవడం, ఉన్నతాధికారులతో మాట్లాడుతూనే ఇంట్లో ఇతర పనులు చేసుకోవడం వంటి ఎన్నో గడిచిన రేండ్లేండ్లుగా వేతన జీవులకు అలవాటైపోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. దీంతో ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ఇక మాస్కులు, శానిటైజర్లతో పనే లేకుండా పోయింది. వర్క్ ఫ్రం హోంతో ఉద్యోగులకు ఫ్లెక్సిబిలిటీ లభించగా, సంస్థలకు ఉత్పాదకతా పెరిగింది. ఫలితంగా వర్క్ ఫ్రం హోంను చాలామంది ఉద్యోగులు ఇష్టపడుతుండగా, యాజమాన్యాలనూ ఇది మెప్పించింది. ఈ క్రమంలోనే పలు కంపెనీలు తమ ఉద్యోగులకు కోరుకున్నప్పుడు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఇస్తామని ప్రకటించాయి. వాటిలో..
టాటా స్టీల్
ఉద్యోగుల శ్రేయస్సుకు ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే దేశీయ ఉక్కు ఉత్పాదక దిగ్గజం టాటా స్టీల్.. ‘ఏజిల్ వర్కింగ్ మోడల్’ పేరుతో తమ ఎంప్లాయీస్‌కు ఏడాదంతా ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఫలానా చోట తప్పక పనిచేయాల్సిన అధికారులకూ వర్క్ ఫ్రం హోంను వర్తింపజేసింది. కాగా, కరోనాతో ఉద్యోగులు మరణించినా.. వారి కుటుంబాలకు నెలసరి జీతాలను సంస్థ ఇస్తుండటం గమనార్హం. వైద్య ఖర్చులను, నివాస సదుపాయాలనూ అందిస్తున్న సంగతీ విదితమే.
కరోనా వైరస్ వెలుగుచూసిన దగ్గర్నుంచే ట్విట్టర్.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంభిస్తున్నది. ఆఫీసులకు తప్పక రావాల్సినవారు మినహా ఎవరైనా వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవచ్చని ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది. మళ్లీ కార్యాలయాలకు రావాలని అనిపిస్తేనే రావచ్చని చెప్పింది. ఇక కస్టమర్లకు ఇబ్బంది లేకుండా మరింత మందిని నియమించుకునే యోచనలోనూ ట్విట్టర్ ఉండటం విశేషం.
స్లాక్
ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఎన్నో సంస్థలకు అందించిన స్టాఫ్ట్వేర్ వేదిక స్లాక్ సైతం.. తమ ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రం హోంను ప్రకటించింది. గతేడాది కరోనా వైరస్ మొదలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని ఈ క్యాలిఫోర్నియా సంస్థ కల్పించింది.
మైక్రోసాఫ్ట్
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని శాశ్వతం చేసింది. వారంలో 50 శాతానికి మించకుండా ఉద్యోగులు ఎప్పుడైనా ఇంటి నుంచే పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది. మేనేజర్ స్థాయి ఉద్యోగులకూ ఇది వర్తిస్తుంది. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకోవచ్చు. అయితే సంస్థాగత నిర్ణయాల ప్రకారం సదరు ఉద్యోగుల జీతం, ఇతర ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ హోం ఆఫీస్ ఖర్చులను చెల్లిస్తామని స్పష్టం చేసింది.
మెటా-ఫేస్బుక్
మెటా-ఫేస్బుక్ కూడా తమ ఉద్యోగులకు కరోనాతో నిమిత్తం లేకుండా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి ఆఖర్నుంచి అమెరికా ఆఫీసులను పూర్తి స్థాయిలో తెరుస్తామని ప్రకటించినా.. కోరుకున్న ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని పొందవచ్చన్నది.
షాపీఫై
క్లౌడ్ ఆధారిత సంస్థ షాపీఫై కూడా తమ ఉద్యోగులకు ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ప్రపంచాన్ని ఒమిక్రాన్ చుట్టుముట్టిన నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోం తెరపైకి వస్తున్నది. పలు సంస్థలు ఇలా ఉద్యోగులకు ఈ అవకాశాన్నివ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
మ్యూజిక్ స్ట్రీమింగ్
స్వీడన్‌కు చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్పూటిఫై.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేసింది. ఆఫీస్ నుంచి పనిచేయాలా?.. ఇంటి నుంచే పనిచేయాలా? అనేది ఉద్యోగుల ఇష్టమని ఈ సంస్థ ప్రకటించింది.