యాచారం, జూలై 1: ఫార్మా గ్రామాల్లోని పచ్చనిపొలాల్లో మళ్లీ చిచ్చు రాజుకున్నది. రైతులు సాగు చేస్తున్న భూములపై అధికారులు, పోలీసులు జేసీబీలతో దండయాత్రకు దిగారు. దీంతో పచ్చని పొలాలను ధ్వంసం చేసేందుకు వచ్చిన అధికారులపై రైతులు తిరగబడ్డారు. మహిళలు జేసీబీలకు అడ్డుగా వెళ్లారు. దీంతో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పచ్చని పొలాల్లో ఫ్యూచర్‌సిటీ చిచ్చు రాజుకున్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకొనేందుకు కోర్టు స్టే అర్డర్ ఉన్న భూముల్లోకి బుధవారం రెవెన్యూ, టీజీఐఐజీ అధికారులు అక్రమంగా చొరబడ్డారు.
పోలీసుల పహారా నడుమ జేసీబీలతో బలవంతంగా రైతుల పొలాలను ముట్టడించారు. అధికారుల పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా మర్లకుంటతండా, మేడిపల్లిలోని ఫార్మా భూముల్లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సైదులు, సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. మర్లకుంటతండాలో 155, 288 సర్వే నంబర్లలో విస్లావత్ సరియా, విస్లావత్ నాన్య, విస్లావత్ కడియా, విస్లావత్ జంగులు తమ భూములను సాగు చేసుకొంటున్నారు. వానకాలంలో వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తున్న జొన్న పంటలను పోలీసు పహారా నడుమ రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు జేసీబీలతో దున్ని ధ్వంసం చేయించారు.
పచ్చని పంట భూములను జేసీబీలతో చదును చేయించారు. దీంతో రైతులంతా ఏకమై ఫార్మా భూముల్లో పంటలను నాశనం చేస్తున్న జేసీబీలను ఒక్కసారిగా అడ్డుకున్నారు. టీజీఐఐసీ అధికారులకు, గిరిజన రైతులకు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. దీంతో మండలంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమ భూముల్లో కోర్టు స్టే ఉన్నదని, తమ భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు, రోడ్డు పనులను చేపట్టవద్దని రైతులు అక్కడికి వచ్చిన అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప, ఆర్ఐ మురళీకృష్ణ దగ్గరుండి పంటలను ధ్వంసం చేయించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చెమటోడ్చి కష్టపడి సాగు చేసుకున్న పంటలను కండ్లముందే నాశనం చేస్తుండటంతో అన్నదాతలు తట్టుకోలేకపోయారు. తమ పంటలను నాశనం చేయొద్దని అధికారులను, పోలీసులను కాళ్లావేళ్లపడి వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతాం, మా పంటలను నాశనం చేయొద్ద’ని మహిళా రైతులు బోరున విలపిస్తూ పోలీసులను బతిమిలాడారు. అయినప్పటికీ, పోలీసులు పట్టించుకోకుండా గిరిజన రైతులపై వీరంగం చేశారు. రైతులను జేసీబీల వద్దకు రాకుండా వారిపై దౌర్జన్యం చేశారు. భూముల్లో నుంచి వెళ్లి పోవాలని, అధికారులకు సహకరించాలని పోలీసులు రైతులను హెచ్చరిస్తూ బెదిరించారు. అయినప్పటికీ, ప్రాణం పోయినా సరే భూములను వదులుకోబోమని రైతులు స్పష్టంచేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పంటలను నాశనం చేయొద్దంటూ జేసీబీలను అడ్డకొంటున్న రైతులను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో మహిళా రైతులు ఒక్కసారిగా లబోదిబోమంటూ బోరున విలపించారు.
మేడిపల్లి గ్రామంలోనూ రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొన్నది. రైతులు జేసీబీలను అడ్డుకోవడంతో పోలీసులు రైతులను ఈడ్చుకెళ్లారు. అధికారులు రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని రైతులతోపాటు స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త శ్రీకాంత్ ఖండించారు. తమ భూములను తీసుకోవద్దని, ముందుగా తమకు ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. స్పష్టమైన కోర్టు స్టే ఆర్టర్ ఉన్న భూముల్లోకి ఎలా వస్తారని, కష్టపడి సాగు చేసుకున్న పత్తి, జొన్న పంటను జేసీబీలతో దున్ని ఎలా నాశనం చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు.
పరిహారం తీసుకున్న ఫార్మా భూముల్లో పంటలు వేయొద్దని ముందే చెప్పామని, అయినా ఎందుకేశారని తహసీల్దార్ అయ్యప్ప ప్రశ్నించగా, తాము తమ భూములను ఫార్మాసిటీకి ఇవ్వలేదని, తమకు ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ వద్దని రైతులు సమాధానం చెప్పారు. బలవంతంగా తమ భూముల్లోకి వచ్చి, రైతులను బెదిరించి భూములను స్వాధీనం చేసుకుంటే ఊరుకొనేదిలేదని, ఎంతటికైనా తెగిస్తామని గిరిజన రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. తమ భూములను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ గుండాగిరీ ప్రభుత్వం కొనసాగుతున్నదని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నేత కవుల సరస్వతి పేర్కొన్నారు. సాగుచేస్తున్న పంటలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
కండ్ల ముందే పంట నాశనం అవుతుంటే తట్టకోలేక తన పంటను నాశనం చేయొద్దంటూ జేసీబీకి అడ్డుగా వెళ్లారు. ప్రాణం పోయినా సరే పంటను నాశనం చేయనివ్వనంటూ ఓ మహిళా రైతు జేసీబీకి అడ్డంగా నిలబడింది. పంట నాశనం చేస్తున్న జేసీబీ అద్దాలు పగులగొట్టేందుకు మహిళా రైతు యత్నించింది. అది గమనించిన మహిళా కానిస్టేబుల్ అమెను అడ్డుకొని అరెస్టు చేసేందుకు వెళ్లింది. దీంతో మహిళా రైతు సహనం కోల్పోయి ఆగ్రహంతో ఏకంగా మహిళా కానిస్టేబుల్‌పై తిరగబడింది. కోపంతో రగిలిపోయిన సదరు మహిళా రైతు.. తన దగ్గరికి వస్తే చేతిలో ఉన్న రాయితో కొడుతానని బెదిరించింది. ‘మా ప్రాణం కంటే మా భూమే మాకు ముఖ్యం’ అని తేల్చి చెప్పింది. ముందు జేసీబీని ఆపి ఇక్కడి నుంచి పంపించిన తరువాతే తనవద్దకు రావాలని డిమాండ్ చేయగా, మహిళా కానిస్టేబుల్ జేసీబీని నిలిపివేసి రైతును అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది.