కట్టంగూర్, జూలై 1 : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని, హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన రైతు సభ అసలైన సభ కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు కేసీఆర్ రూ.10వేలు ఇస్తే తాము రూ.15వేలు ఇస్తామని, ఆ ముష్టి పదివేలు ఎవరికి కావాలి అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి వరకు దాదాపు రూ.30వేల కోట్ల రైతు భరోసా నిధులకు ఎగనామం పెట్టారని, ఐదెకరాల నుంచి మొదలు పెట్టి నెలకు ఒకట్రెండు ఎకరాల చొప్పున కాలయాపన చేస్తూ రైతుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30వేల కోట్లు ఎగ్గొట్టి ఏ ముఖం పెట్టుకొని రైతు సభలు జరుపుకుంటున్నారని నిలదీశారు. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు పొలాలు దున్ని నాట్లు వేస్తున్నారని, మార్కెట్లో యూరియా దొరకక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీసుకొచ్చిన యాప్ వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదని, ఎరువుల దుకాణ దారులు, సొసైటీ అధికారులు తమకు నచ్చిన వాళ్లకు ఓటీపీల ద్వారా బుక్ చేస్తూ యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.
మూడేండ్లలో మూడు సార్లు ఎరువుల ధరలు పెంచినా నోరు మెదపని సీఎం ఇప్పుడు ఎల్‌నినో అంటూ సాకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, రైతు రాజులా బతికాడని నేడు కాంగ్రెస్ హయాంలో రైతు అరిగోస పడుతున్నాడని చిరుమర్తి పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ.. మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవడమే ఈ ప్రభుత్వ ఏకైక ఆశయమని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తే దానిమీద కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వందల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేస్తూనే మళ్లీ అదే కాళేశ్వరం నీళ్లను సాగు, తాగునీటికి ఎలా వాడుకుంటున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు గేటు చిన్న రిపేరు వస్తే చేయలేక నీరంతా వృథాగా వదిలేసిన చేతకాని ప్రభుత్వమని మండిపడ్డారు. తమ వైఫల్యాలపై కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు బూతు పురాణం అందుకుంటున్నారని, జనం అన్నింటిని గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని జనం పాతరేయడం ఖాయమన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్‌ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, మాజీ సర్పంచ్ దాసరి సంజయ్‌కుమార్, మాజీ ఉప సర్పంచ్ అంతటి శ్రీను, నాయకులు నోముల వెంకటేశ్వరు, రాజకొండ యాదయ్య, గాదపాక కన్నయ్య, గోలి శివ తదితరులు పాల్గొన్నారు.