నీలగిరి, జూలై 1: తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మీ శ్రీకాంత్@అమ్మిరాజును నల్గొండ జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఐదు రోజు ల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లాలో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం అందడంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు డీసీఎంలో డ్రైవర్ వేల్పుల అతేంద్రతో కలిసి వస్తూ భూష్మీ శ్రీకాంత్ పోలీసులకు పట్టుబడ్డాడు.
అత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు..
జిల్లాలో కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్‌రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తెలంగాణ, ఏపీలో విసృ్తతంగా గాలింపు చర్యలు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూష్మీ శ్రీకాంత్@అమ్మిరాజు ముఠాను గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 30న ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నిందితుడు డీసీఎంలో నాగార్జునసాగర్ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వాహనాన్ని వెంబడించారు. దీంతో నిందితుడు శ్రీకాంత్ వాహనంలో నుంచి కిందకు దూకి ఇనుప రాడ్డు, కత్తితో పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు దెబ్బ తగిలింది. ఈ సందర్భంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం ముందుగా మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ నిందితుడు పోలీసులపై దాడి కొనసాగిస్తుండటంతో ఆత్మరక్షణలో భాగంగా అతని కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
రికవరీ కోసం కస్టడీ కోరుతాం..
శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు చోరీ చేసిన సొత్తుపై క్లారిటీ రాలేదని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. శ్రీకాంత్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయన బుధవారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కరుడుగట్టిన నేరస్తుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మిర్యాలగూడ రూరల్ ఇన్స్పెక్టర్ పీఎన్డీ ప్రసాద్, ఎస్ఐ విజయ్ కుమార్ సీసీఎస్ సిబ్బంది విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా ఫయాజ్, శివరాజ్, నరేశ్, గులాం దస్తగిరి, కమల్ కిశోర్, సాయి, జునైద్, ఆశ్రఫ్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రకటించారు.
శ్రీకాంత్‌పై 40 దొంగతనాలతో పాటు హత్య కేసు
కుటుంబం లేని శ్రీకాంత్ ఇష్టానుసారంగా తిరుగుతూ ఇండ్లను అద్దెకు తీసుకుని కేవలం 10 నుంచి 15 రోజులే ఉంటూ రెండు మూడు దొంగతనాలు చేసి మకాం మార్చేవాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్‌పై తెలంగాణ, ఏపీలో సుమారు 40 కేసులకుపైగా నమోదయ్యాయి. అంతేకాకుండా గతంలో ఓ కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసు కూడా ఉంది. గతంలోనే 30 పైగా కేసులు నమోదైన శ్రీకాంత్ జైలు నుంచి విడుదలైన తర్వాత 40కి పైగా చోరీలకు పాల్పడ్డాడు.