మెక్సికో సిటీ: సాకర్ ప్రపంచకప్‌లో 40 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మెక్సికో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపిన సహ ఆతిథ్య దేశం నాకౌట్లోనూ అదే జోరు కొనసాగించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం జరిగిన రౌండ్-32లో మెక్సికో 2-0తో ఈక్వెడార్‌ను ఓడించి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. 1986 తర్వాత మెక్సికో జట్టు ప్రిక్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. ఆ ప్రపంచకప్ తర్వాత వరుసగా ఏడుసార్లూ రౌండ్-32లోనే నిష్క్రమించిన మెక్సికో స్వదేశంలో మాత్రం ఆ అడ్డుగోడను అధిగమించింది. జులియన్ క్వినోన్స్ (22వ నిమిషంలో), రవుల్ హిమనెజ్ (31 వ) చెరో గోల్ కొట్టి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
సొంత అభిమానుల నడుమ నాకౌట్ బరిలోకి దిగిన మెక్సికో.. తొలి అర్ధభాగంలోనే ప్రత్యర్థిపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత సౌదీ ప్రో లీగ్‌లో అత్యధిక గోల్స్‌తో ఆకట్టుకున్న ఫార్వర్డ్ జులియన్.. బాక్స్ వెలుపలి నుంచి గోల్ కొట్టి మెక్సికోను ఆధిక్యంలోకి తెచ్చాడు. ఆ వెంటనే స్టార్ స్ట్రైకర్ హిమనెజ్ సైతం గోల్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో మెక్సికో కంటే బంతిని తమ అధీనంలోనే ఉంచుకున్న ఈక్వెడార్.. గోల్ కొట్టడంలో మాత్రం విఫలమైంది. ఆ జట్టు ఏడుసార్లు మెక్సికో గోల్‌పోస్ట్‌పై దాడులకు దిగినా అవి ఫలించలేదు. మెక్సికో 15 సార్లు గోల్‌కు యత్నించి రెండుసార్లు సఫలమైంది. 1986లో మెక్సికో ప్రిక్వార్టర్స్ ఆడినప్పుడు మిడ్‌ఫీల్డర్‌గా ఉన్న జేవియర్ ప్రస్తుతం ఆ జట్టు కోచ్‌గా ఉండటం విశేషం.