Waist Circumference | ఊబకాయం గుండె సంబంధిత అనేక సమస్యలకు కారణమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. అయితే శరీరంలో కొవ్వు ఏ ప్రాంతంలో ఎక్కువగా పేరుకుపోతుందన్న విషయం కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా నడుము, తుంటి చుట్టుకొలత ఎక్కువగా ఉన్న మహిళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌కు చెందిన 4,79,610 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలో వారి వయస్సు 40 నుంచి 69 సంవత్సరాల మధ్య ఉండగా, సగటు వయస్సు 56 సంవత్సరాలుగా ఉంది. పాల్గొన్నవారిలో ఎక్కువ మంది అధిక బరువుతో ఉన్నప్పటికీ, అప్పటివరకు వారికి గుండె జబ్బుల చరిత్ర లేదు. సగటున ఏడేళ్ల పాటు వారిని పరిశీలించగా, ఈ కాలంలో 5,710 మంది గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు.
నడుము చుట్టుకొలత అసాధారణంగా ఎక్కువగా ఉన్న మహిళల్లో గుండెపోటు ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే నడుము-తుంటి నిష్పత్తి ఎక్కువగా ఉన్న మహిళలు కూడా అధిక ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. పురుషుల్లోనూ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే యాపిల్ షేప్ శరీరాకృతి కనిపించినప్పటికీ, ఇదే తరహా శరీరాకృతి ఉన్న మహిళలతో పోలిస్తే గుండెపోటు ప్రమాదం మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఊబకాయం గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకమన్న విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయే విధానం గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని ఈ అధ్యయనం మరింత స్పష్టంగా చూపించింది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఊబకాయం అంటే శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. అధిక బరువు, ఊబకాయం వల్ల గుండె జబ్బులతోపాటు మధుమేహం, కీళ్ల సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరుగుతుందది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే అంతర్గత కొవ్వు శరీరంలో వాపు వంటి ప్రక్రియలను ప్రేరేపించి, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువును నియంత్రించుకోవాలనుకునేవారు శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లకు బదులుగా సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోవడం మంచిది. బజ్రా, రాగి, మొక్కజొన్న, జొన్న వంటి సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో తరచూ చేర్చుకోవచ్చు. తెల్ల బియ్యానికి బదులుగా ఎరుపు, నలుపు లేదా బ్రౌన్ రైస్‌ను ఎంచుకోవచ్చు. వీటిని అల్పాహారంలో గంజి రూపంలో కూడా తీసుకోవచ్చు. ధాన్యాల మాదిరిగానే పొట్టు తొలగించని సంపూర్ణ పప్పుధాన్యాలు కూడా ఆరోగ్యకరమైన ఎంపికగా ఉన్నాయి. రాజ్మా, శనగ పప్పు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని కూరలుగా వండుకోవడంతోపాటు మొలకల రూపంలో లేదా సూప్‌లలో కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే ప్రొటీన్ వనరులను ఎంచుకోవాలి. చికెన్, సాల్మన్ వంటి ఆహారాలను తీసుకోవచ్చు. ప్రతి భోజనంలో తగినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం బరువు నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్‌కు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఫాస్ట్‌ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ జంక్ ఫుడ్, కుకీలు, బర్గర్లు, నూడుల్స్, కొన్ని పాస్తా వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
చక్కెర వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. రోజువారీ మొత్తం కేలరీల్లో చక్కెర వాటా 10 శాతానికి మించకుండా చూసుకోవాలి. అంతకంటే 5 శాతం లోపులో ఉంచితే మరింత మంచిది. మనం తీసుకునే అనేక ఆహారాల్లో సహజంగా ఉండే చక్కెరతోపాటు అదనంగా చేర్చిన చక్కెర కూడా ఉంటుంది. కనుక ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు చక్కెర పరిమాణంపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం. అయితే ఈ అధ్యయనం పరిశీలనాత్మకమైనదే తప్ప నియంత్రిత ప్రయోగం కాదు. అంటే శరీర బరువు లేదా కొవ్వు ఏ ప్రాంతంలో పేరుకుపోవడం వల్ల నేరుగా గుండెపోటు వస్తుందని ఈ అధ్యయనం నిర్ధారించలేదు. మరో పరిమితి ఏంటంటే.. అధ్యయనంలో పాల్గొన్నవారంతా తెల్ల జాతికి చెందినవారు. ఇతర జాతులు లేదా భిన్నమైన జనాభాలో ఫలితాలు వేరుగా ఉండే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీర బరువుతోపాటు నడుము చుట్టుకొలతను కూడా గమనించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెరను తగ్గించడం వంటి జీవనశైలి మార్పులు చేయడం ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.