కారేపల్లి,నవంబర్11 : మహిళలు పురుషులతో సమానంగా అన్నీ రంగాలలో ఎదుగుతున్నారని ఖమ్మం జిల్లా కారేపల్లి ఎస్ఐ సాయిని నవిత అన్నారు. కారేపల్లిలో గల ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో గల వైరా నియోజకవర్గ తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ రమేష్, ఎస్ఐ సాయిని నవితలు ముఖ్య అతిథిలుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్ల అనగానే చిన్న చూపు చూడకుండా తల్లిదండ్రులు ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. మగ పిల్లలతో సమానంగా చదివించాలని, అప్పుడే ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా అన్ని రంగాలలో దూసుకెళ్తన్నారన్నారు. మహిళలు ఆపద సమయాల్లో అధైర్యపడకుండా వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని, అలాగే లోకల్ పోలీస్టేషన్ ఎస్ఐ,సిఐ. ఫోన్ నంబర్ లు తమ ఫోన్లో సేవ్ చేసుకోవాలని సూచించారు.
అనంతరం చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు మెమొంటోలు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దారా సావిత్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎండీ బాబు, కారేపల్లి మైనార్టీ నాయకులు షేక్ షఫీ, తాజుద్దీన్, యాకూబ్, అనే యాకూబ్ పాషా ఉపాధ్యాయులు, భవాని, రాణి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.