అలియాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 20 వార్డులకుగానూ 8 వార్డుల్లో కాంగ్రెస్, ఏడు వార్డుల్లో బీఆర్ఎస్, మూడు వార్డుల్లో బీజేపీ, ఒక వార్డులో బీఎస్పీ, మరో వార్డులో బీఎస్పీ గెలిచాయి. ఈ క్రమంలో పాలకమండలి ఏర్పాటు చేయడం కోసం అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి.
ఇదే అదనుగా భావించిన ఇండిపెండెంట్ ఏకంగా ఛైర్మన్ పదవికి టెండర్ వేశాడు. తనకు ఏ పార్టీ ఛైర్మన్ పదవి ఇస్తానంటే ఆ పార్టీకే మద్దతు ఇస్తా అని స్పష్టం చేశాడు. గాదె వెంకటేశ్ అనే వ్యక్తి ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేసి ఏడో వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా విజయం సాధించాడు. ఇప్పుడు ఛైర్మన్ పదవి కోసం డిమాండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అలియాబాద్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేశ్‌ను లోపలికి వెళ్లనీయకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని వెంకటేశ్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కొంత తోపులాట జరిగింది.