– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీకి పెరుగుతున్న మద్దతు
– 19వ రోజు దీక్షలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి సంఘీభావం
బూర్గంపహాడ్, ఏప్రిల్ 13 : కార్మికుల శక్తి ఏమిటో తమ పోరాటం ద్వారా ఐటీసీ యాజమాన్యానికి చూపిస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా హెచ్చరించారు. సోమవారం 19వ రోజు దీక్షా శిబిరాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ బాధ్యులు సదానందం సందర్శించి దీక్షల్లో కూర్చున్న కాంట్రాక్టు కార్మికులు సందిపాము బాబు, దార్ల కవిత, ముష్టికుంట వెంకటరమణ, వట్టం కవిత, కడబోయిన చంద్రకళ, మేకల రమేశ్‌కు సంఘీభావం ప్రకటించారు.
ఇప్పటికే 18 రోజులుగా జరుగుతున్న రిలే దీక్షలకు పలు పార్టీల నాయకులు, మాజీ ప్రతినిధులతో పాటు కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో జేఏసీ నాయకులు రెట్టించిన ఉత్సాహంలో పోరాటాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎండను సైతం లెక్కచేయకుండా 19 రోజులుగా దీక్షలు చేస్తున్న కార్మికులను ఐటీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో తాము కార్మికులకు అండగా ఉంటామన్నారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకుండానే కాలం ముగిసిపోయిందన్నారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఐటీసీ యాజమాన్యానికి పట్టనట్లుగా ఉన్నాయని, కార్మిక సమస్యల పరిష్కారంలో ఐటీసీ యాజమాన్యం తాత్సారం చేస్తే మున్ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని, సమ్మెబాట సైతం కార్మికులు పడతారని హెచ్చరించారు. కార్మిక సంఘ నాయకులను చర్చలకు పిలిచి వారి సమస్యలను యాజమాన్యం పరిష్కరించకుంటే మున్ముందు నిరసనలు ఉంటాయని, పోరాటం ఉధృతంగా ఉంటుందన్నారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు శేషమ్మ, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, దారా రాము, సమ్మక్క, ప్లాంటేషన్ మహిళా కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.