Narsapur | నర్సాపూర్: భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భార్య బలవర్మణానికి పాల్పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది.
ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మీ ‘(58) తన భర్త శివరాములు గత నాలుగు నెలల క్రితం మృతిచెందాడు. భర్త మరణంతో లక్ష్మీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
లక్ష్మీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. ఈ క్రమంలో చెరువు గట్టు సమీపంలో లక్ష్మీ చెప్పులు కనిపించాయి. దీంతో సాయంత్రం చెరువులో గాలించారు. అప్పటికే చీకటి కావడంతో గాలింపు చర్యలు ఆపివేశారు. శనివారం ఉదయం 6 గంటలకు చెరువు వద్దకు వెళ్లి చూడగా.. లక్ష్మీ మృతదేహం ఒడ్డున పడి ఉన్నది. కాగా, తన తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తన తల్లి ఆత్మహత్య చేసుకున్నదని కుమారుడు సాయి తేజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.