WI vs IND | వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.. అహ్మదాబాద్ వేదికగా వెస్డిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 237 పరుగులు చేసింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 46 ఓవర్లలోనే 193 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత్ విజయంలో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కీలకంగా వ్యవహరించాడు. ఫలితంగా రెండో వన్డే గెలిచి.. సిరీస్‌ను దక్కించుకుంది. ఇక మూడో వన్డే నామమాత్రంగా ఫిబ్రవరి 11న జరగనుంది.
రెండోవన్డేలో భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ ఫినిష్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన ప్రసిద్ధ్.. ఆ మరుసటి ఓవర్‌ను వికెట్ మెయిడెన్‌గా ముగించాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా పుంజుకొని సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్‌కూ వికెట్ దక్కింది. దీపక్ హుడా కూడా కీలక వికెట్ తీశాడు. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షాయి హోప్ (27), బ్రాండన్ కింగ్ (18), డారెన్ బ్రావో (1), నికోలస్ పూరన్ (9), జేసన్ హోల్డర్ (2), ఫాబియన్ అలెన్ (13), కీమర్ రోచ్ (0), అల్జారీ జోసెఫ్ (7 నాటౌట్) పరుగులు చేశారు. షార్మా బ్రూక్స్ (44), అకీల్ హొస్సేన్ (34), ఒడియన్ స్మిత్ (24) రాణించారు. అయితే భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో విండీస్ కోలుకోలేకపోయింది. చివరకు 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. 46వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ.. ఈ ఓవర్‌ను వికెట్ మెయిడెన్‌గా ముగించాడు. ఓవర్ చివరి బంతికి రోచ్‌ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. శార్దూల్ ఠాకూర్ 2, మహమ్మద్ సిరాజ్ 1, యుజ్వేంద్ర చాహల్ 1, వాషింగ్టన్ సుందర్ 1, దీపక్ హుడా 1 వికెట్ తీసుకున్నారు. సూపర్ బౌలింగ్‌తో భారత్‌కు విజయాన్ని కట్టబెట్టిన ప్రసిద్ధ్ కృష్ణకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్, పంత్, కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేఎల్ రాహుల్ (49), సూర్యకుమార్ యాదవ్ (64) టీమిండియాను ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రాహుల్ అవుటైన తర్వాత సూర్యతో వాషింగ్టన్ సుందర్ జతకట్టాడు. వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించిన తర్వాత సూర్య కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో హిట్టర్లు లేని టీమిండియా బ్యాటర్లు నిరాశపరిచారు. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (8) మరోసారి బ్యాటుతో నిరాశపరచగా.. మహమ్మద్ సిరాజ్ (3), చాహల్ (11) పరుగులు చేశారు. దీపక్ హుడా (29) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, ఫాబియాన్ అలెన్ తలో వికెట్ పడగొట్టగా.. అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.