ఇస్లామాబాద్ : పాకిస్థాన్ తన సొంత ప్రజలపైనే బాంబులు కురిపిస్తున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వాపై సోమవారం చైనా తయారీ జే-17 యుద్ధ విమానాలతో కురిపించిన 8 ఎల్ఎస్-6 బాంబులు 30 మందిని బలిగొన్నాయి. ఈ బాంబులు లేజర్ గైడెడ్ ప్రెసిషన్ మ్యునిషన్స్. తీరహ్ లోయలోని ఓ గ్రామంపై తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉగ్రవాద దాడులు పెరిగాయి. తాజా దాడుల్లో సంభవించిన మరణాలతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. గత వారం స్వాట్ లోయలోని మింగోరా పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. ప్రభుత్వం సత్వరమే శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పాక్ మీడియా కథనాల ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహరీక్-ఏ-తాలిబన్(టీపీపీ) బాంబుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నదని, అందుకే దాడి చేశామని పాకిస్థాన్ వాయుసేన చెప్తున్నది. ఈ ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్థాన్‌లో ఉందని, దానికి అఫ్గాన్ ప్రభుత్వంతో అనుబంధం ఉందని చెప్తున్నది. ఈ ఆరోపణలను అఫ్గాన్ ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది. హింసను నియంత్రించడంలో పాక్ విఫలమవుతున్నదని ఆరోపిస్తున్నది. పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, మాటల్లో చెప్పలేనంత విషాదం జరిగిందని తెలిపింది. బాంబులు, డ్రోన్ దాడుల వల్ల విద్వేష బీజాలు నాటుకున్నాయని పేర్కొంది.