పారిస్ : రష్యా దాడులు అంతరిక్షంలో పెరిగినట్లు ఫ్రెంచ్ మేజర్ జనరల్ విన్సెంట్ చుస్సీయూ పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. శాటిలైట్లకు అంతరాయాలు కలిగించడం కోసం రష్యా రకరకాల పద్ధతులను పాటిస్తున్నదన్నారు. జామింగ్, లేజర్స్, సైబర్ దాడులు వంటివి సర్వ సాధారణ విషయంగా మారిపోయాయని తెలిపారు. ‘రాయిటర్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్షం పూర్తి స్థాయి యుద్ధ క్షేత్రంగా మారిందని చెప్పారు.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విస్తృత స్థాయికి చేరినప్పటి నుంచి పాశ్చాత్య దేశాల శాటిలైట్లపై రష్యా దాడులు పెరిగాయన్నారు. ‘ఆర్బిటాల్ టుడే’ వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యన్, పాశ్చాత్య దేశాల శాటిలైట్స్ ఒకదానికొకటి చేరువగా రావడం అత్యంత సాధారణ విషయంగా మారింది. రష్యా వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి ప్రపంచ దేశాలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ హెచ్చరిస్తున్నాయి.