యాదాద్రి భువనగిరి, జులై 09 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే నెల జీతం పేదలకే అంకితం చేస్తాననన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హామీ ఏమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఆదర్శవంతుడనని మీడియా ముందు గొప్పగా గప్పాలు కొట్టుకున్నారని, ఇప్పుడేమో ముఖం చాటేశారని దుయ్యబట్టారు. నెలనెలా వస్తున్న జీతంలో సగమైనా ప్రజలకు పంపిణీ చేయలేదని, ఇదేమి నీతి? ఇదేమి హామీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీతోనే సరిపెట్టారా అని నిలదీశారు. గతంలో చెప్పినట్టు జీతం మొత్తంలో తొమ్మిది రూపాయలే తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. 18 నెలల జీతం ఏ పేదలకు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోజుకో అమలు కానీ హామీలు ఇవ్వడం ఆలేరు ఎమ్మెల్యేకే సాధ్యమన్నారు. బీర్ల ఐలయ్య చెప్పేవన్నీ నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకుంటున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.