కలెక్టరేట్, మార్చి 17: మాయమాటలు చెప్పి కరీంనగర్ ఎంపీగా గెలిచిన నీవు ఈ మూడేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఏం చేశావో చెప్పాలని బండి సంజయ్‌ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘బాత్ కరోడోమే కామ్ పకోడోమే’ అన్నట్లుగా బీజేపీ పని తీరు ఉందని, అందుకే ఆ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న తమ వైపు దృష్టి సారిస్తున్నారని, అందులో భాగంగానే కరీంనగర్లో కూడా ఇద్దరు కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారని తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థకు చెందిన బీజేపీ ఇద్దరు కార్పొరేటర్లు మెండి శ్రీలతాచంద్రశేఖర్, నక్క పద్మ కృష్ణ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ధర్మం కోసం అంటూ చెప్పే నీవు కరీంనగర్లో ఒక్క గుడి, బడి కోసం నిధులు తెచ్చావా?’ అని నిలదీశారు. డబుల్ ఇంజన్‌తో అభివృద్ధి అంటూ చెబుతున్న బీజేపీ ఎంపీలు ఇక్కడ ఎందుకు అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అక్కడ మోడీ ఇంజన్, ఇక్కడ బోడీ ఇంజన్ ఉంది కదా.. అంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్‌కు ఏం తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడ అభివృద్ధికి కనీసం రూపాయి నిధులు తేలేని మీరు హిందూ ధర్మం అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గంగుల పై పోటీ చేసి ఓడిపోయిన నీవు ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్లు గెలిచి గారెల బుట్టలో పడ్డావని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినా ఎక్కడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా నిస్సహాయ మంత్రిగా మిగిలిపోయారన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ మాయలో పడకుండా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని 26,44 డివిజన్ల కార్పొరేటర్లు నక్క పద్మ, మెండి శ్రీలత, 6వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొమ్మరాతి సాయికృష్ణతో పాటు సుమారు 200మంది పైగా కార్పొరేటర్ల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, ఎలగందుల రమణ, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త్తా, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.