హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతకు వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొని అరెస్టయిన విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోవడంలేదు. ఇప్పుడే పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నానంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విద్యార్థులతో మాటలు చెప్పి రెండు నెలలు గడుస్తున్నది.
కేసుల విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు చెప్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో నిరీక్షణ తప్పడడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రకృతిపై విధ్వంసాన్ని అడ్డుకున్న తమపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడమేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అక్రమంగా పెట్టిన కేసులను కొట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హెచ్‌సీయూ ప్రాంగణంలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు ఎర్రం నవీన్, రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ 118 (1), 132, 191 (3), 329 (3), 351(3) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వీరితో పాటు 54 మందిపై బీఎన్ఎస్ 170 సెక్షన్ కింద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కంది జైలులో 15 రోజులు ఉన్న తర్వాత ఎర్రం నవీన్, రోహిత్ బెయిల్‌పై బయటకు వచ్చినా విచారణ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.