హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వీక్లీ టెస్టులు నిర్వహించనున్నారు. వారంలో ఐదు రోజులు పాఠ్యాంశాలను బోధించి, ఆరోరోజు విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులే పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక తరగతుల్లో అభ్యసన నష్టాన్ని పూడ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తారు.
విద్యార్థులు సాధించిన ప్రగతిని రికార్డుల్లో నమోదు చేస్తారు. ఆయా వివరాలను త్వరలో అందుబాటులోకి రానున్న రాష్ట్ర స్థాయి యాప్‌లో కూడా ఉపాధ్యాయులు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో 140 రోజులు (28 వారాలు) విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపుదల కోసం కేటాయిస్తారు.
ఇందుకోసం సబ్జెక్టుల వారీగా ఎస్సీఈఆర్టీ అధికారులు ఉపాధ్యాయుల కోసం కరదీపికలను సిద్ధంచేశారు. రోజువారీగా టీచర్లు చేయాల్సిన పనులు, బోధనా పద్ధతుల గురించి కరదీపికల్లో వివరించారు. పాఠశాలల్లో ప్రతిరోజూ గ్రంథాలయం పీరియడ్‌ను కూడా నిర్వహించనున్నారు. మూడు రోజులు తెలుగు, మరో మూడు రోజులు ఇంగ్లిష్ భాషకు చెందిన కథల పుస్తకాలను చదివిస్తారు.
తొలిమెట్టు (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రాంలో భాగంగా ఆగస్టు 3 నుంచి 6 వరకు ఫైనల్ బేస్‌లైన్ సర్వేను నిర్వహిస్తారు. ఎంపికచేసిన ప్రాథమిక పాఠశాలల్లో పలు సబ్జెక్టులకు 150 నుంచి 200 మంది విద్యార్థులపై శాంపిల్ సర్వే చేపడతారు. దీనికి హెచ్ఎంలు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం ఆదేశించారు.