హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పగటిపూట భానుడు తన ప్రతాపాన్ని చూపుతుంటే, రాత్రిపూట చలి ఉంటున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే 4.2 డిగ్రీలు అధికంగా నమోదై గరిష్ఠ ఉష్ణోగ్రత 34.3 డిగ్రీలకు చేరుకున్నది. ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పగటిపూట ఎండ తీవ్రత సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగింది. జనవరి మూడో వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ఉంటే, వేసవిలో మరింత తీవ్రంగా ఉంటాయనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 8.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ 11 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్ 9.9, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణశాఖ సూచనల ప్రకారం.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది.