Aituc | గోదావరిఖని :సింగరేణి లో కార్మికుల హక్కులను కాపాడేదని, సంస్థ ను రక్షించేది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
రామగుండం ఎన్టీపీసీ లోని శ్రీ మయి ఫంక్షన్ హాల్ ( అమరజీవి కామ్రేడ్ మాదన నారాయణ గారి హాల్ లో) లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సింగరేణి యువ కార్మికుల సదస్సు లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వందేళ్ల కు పైగా చరిత్ర కలిగిన తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకునేందుకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉద్యమాలు చేసి రక్షించుకుందామని, అందుకు యువ కార్మికులు సైనికులు లాగా ఐక్యంగా ఉండి సంస్థ ను కాపాడుకోవాలని ఆయన అన్నారు.
ప్రైవేటు రంగంలో ఉన్న సింగరేణి ని ఎందరో నాయకులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ గా మార్చుకున్నట్లు చెప్పారు. నాటి నుంచి నేటి వరకు సింగరేణి లో అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మికుల సంక్షేమం కోసం అనేక హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణి కి కొత్త గనులు రాకపోవడం మూలంగా ఉన్న గనులను ఓపెన్ కాస్ట్ లుగా మారుస్తూ, కార్మికుల సంఖ్య తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
కొత్త గనులు వస్తనే సింగరేణి కి మనుగడ కొనసాగుతుందని లేకుంటే యువ కార్మికుల కు ఉద్యోగ భద్రత కరువవుతోందని ఆయన అన్నారు. సింగరేణి కి వచ్చే లాభాలు కార్మికుల సంక్షేమం కోసం, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలని, కాని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కి చెందిన కోట్లాది రూపాయలను వాడుకుంటూ సంస్థ కు నష్టం చేస్తుందని ఆయన ఆరోపించారు. సింగరేణి కి బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
సింగరేణి లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం, కొత్త గనులు రావడం కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉద్యమాలు చేస్తుందని, దానికి యువ కార్మికులు అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏఐటియుసి కేంద్ర ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు ఎల్. ప్రకాశ్, ఉప ప్రధాన కార్యదర్శులు మడ్డి ఎల్లా గౌడ్, వై.వి.రావు, మాట్లాడగా, ఉప ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రం, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు కందుకూరి రాజారత్నం, జూపాక రాంచందర్, ఆర్జీ టూ, త్రీ బ్రాంచి కార్యదర్శులు జీగురు రవిందర్, మందల రాంచంద్రారెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షులు మాదన మహేష్, సంకె అశోక్, బ్రాంచి కోశాధికారి ఎస్ వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి కనకరాజు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూరి సూర్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం లు పాల్గొన్నారు.
సదస్సు కు గోదావరిఖని 5 ఇంక్లైన్ చౌరస్తా నుంచి మెయిన్ చౌరస్తా, మార్కేండయ కాలనీ, గౌతమి నగర్ మీదుగా ఖాజిపల్లి శ్రీమయి ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కి ముందు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు పూల బోకె అందించి, శాలువా కప్పి నాయకులు స్వాగతం పలికారు. కళాకారులు ఎజ్జ రాజయ్య, లెనిన్, జూల మోహన్, జాలిగం రాజు తదితరులు సదస్సు లో కార్మిక చైతన్య గేయాలు ఆలపించారు. ఇంకా ఈ సదస్సు లో బ్రాంచి ఆఫీస్ బేరర్స్, పిట్ కార్యదర్శులు, యువ కార్మిక సోదర, సోదరీ మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.