రంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా ముమ్మరంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరై మాట్లాడుతూ.. వరంగల్ సభకు భారీగా తరలివెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్ అంటే వ్యక్తి కాదని..ఓ శక్తి అని ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని స్పష్టం చేశారు. యావత్తు రాష్ర్టాన్ని, మేధావులను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు అం డగా నిలిచిందన్నారు. అలవికాని హామీలు, మోసపూరిత ప్రకటనలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేస్తున్నదని.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణను ఆగమాగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ సర్కార్ కంటే బీఆర్ఎస్ పాలనే బాగున్నదని .. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈనెల 27న వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అధిక సం ఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వరంగల్ సభకు జిల్లా నుంచి అన్ని వర్గాల వారు అధిక సం ఖ్యలో తరలివెళ్లి సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట ఆరంభం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ మీ టింగ్‌లో నవాబు పేట మండ లంలోని నారేగూడెం, పులు మామిడి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 15 మంది మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.