రామవరం, జనవరి 01 : ఈ సంవత్సరం యువ రక్తంతో నిండిన సింగరేణిని చూస్తున్నానని, ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్షాన్ని తప్పకుండా సాధించగలమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలను గురువారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కార్మికులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఏరియాకు ఉద్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో పూర్తి చేసుకోవాలన్నారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేయుటకు సహకారాన్ని అందిస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సంఘ నాయకులకు ఆయన అభినందనలు తెలియజేశారు.
సింగరేణి సంస్థ ప్రతి ఒక్క ఉద్యోగ సంక్షేమానికి, ఆరోగ్యానికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తగిన జాగ్రతలు వహించాలన్నారు. ట్రీట్మెంట్ విషయంలో సింగరేణి కల్పించే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగస్తుడు ఆరోగ్యంగా ఉండడం బొగ్గు ఉత్పత్తికి దోహద పడుతుందన్నారు. కొత్తగూడెం ఏరియా ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ కొత్తగూడెం ఏరియా పేరు సింగరేణి లోనే రికార్డు నెలకొల్పడం ఎంతో సంతోషదాయకమన్నారు. దీనికి ముఖ్య భూమిక పోషిస్తూ భాగస్తులైన ఉద్యోగులు, సూపర్వైజర్లు, యూనియన్లు, అదికారులను అభినంధించారు.
అనంతరం ఈ సంవత్సరంలో 01.01.2026 నకు గాను సర్వీసులు లింకెడ్ ప్రమోషన్స్ (కొత్తగూడెం ఏరియా (74) & సత్తుపల్లి ఏరియా (40)) టైం రేటెడ్ వేకెన్సీ (కొత్తగూడెం ఏరియా (27) & సత్తుపల్లి ఏరియా (15)) లలో అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్ ఆర్డర్లను జిఎం అందజేసి ప్రమోషన్ తీసుకున్న ఉద్యోగస్తులకు అభినందనలు తెలిపారు. అనంతరం వారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు మార్చి, 2024 సంవత్సరం వరకు సీఎంపీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం అమౌంట్ వివరాలను తెలియజేసే స్లిప్పులను అందజేశారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులు వారి మొత్తం సర్వీసు అయిపోయేంత వరకు ఆ అమౌంట్ ను తీసుకోకుండా దాచుకుని పదవీ విరమణ అనంతరం వాటిని సద్వినియోగ పరుచుకోవాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వి.మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ఓ టు జిఎం జి.వి.కోటిరెడ్డి, ఏజిఎంలు సిహెచ్.రామకృష్ణ, బీభత్స, జి.వీ మోహన్ రావు, ఏజెంట్ రామ్ భరోస్ మహతో, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వర్లు, డిజిఎంలు ఎన్.యోహాన్, జై క్రిస్టఫర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, యూనియన్ నాయకులు, సూపర్వైజర్లు, ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.