తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో ద్వారపాలక విగ్రహాలకు బంగారం తాపడం చేపట్టిన సమయంలో బంగారం చోరీకి గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడి నుంచి ఇప్పటికే కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం తాజాగా కొత్త నివేదిక రిలీజ్ చేసింది. అనుమానిత వ్యక్తులు అనుకున్నదాని కన్నా ఎక్కువ మోతాదులోనే బంగారాన్ని చోరీ చేసినట్లు సిబ్ బృందం పేర్కొన్నది. కొల్లాం విజిలెన్స్ కోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో సిట్ ఆ అనుమానాలు వ్యక్తం చేసింది.
స్పాన్సర్ ఉన్నికృష్ణ పొట్టి, స్మార్ట్స్ క్రియేషన్స్ సీఈవో పంకజ్ భండారి, నగల వ్యాపారి గోవర్దన్ రొద్దంను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ తన పిటీషన్లో కోరింది. సుమారు 43 కిలోల బరువున్న బంగారం పూసిన కాపర్ ప్లేట్లను ఎలక్ట్రోప్లేటింగ్ కోసం ప్రధాన నిందితుడు పొట్టికి అప్పగించారు. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ చేశారు. అయితే ఆ ప్రక్రియ చేపట్టిన సమయంలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు.
రీప్లేటింగ్ కోసం ఫీజులో భాగంగా సుమారు 109.243 గ్రాముల బంగారాన్ని పంకజ్ భండారి తీసుకున్నారు. అయితే సిట్ బృందం ముందు ఆ మొత్తం బంగారాన్ని ఆయన అందచేశారు. ప్లేటింగ్ ప్రక్రియ తర్వాత రికవరీ చేసిన బంగారాన్ని గోవర్దన్‌కు అందజేసినట్లు సిట్ పేర్కొన్నది. సిట్ ముందు గోవర్ధన్ 474.960 గ్రాముల బంగారాన్ని చూపించారు. ఎలక్ట్రోప్లేటింగ్ కోసం పొట్టి ఇచ్చిన దానికి సమానంగా బంగారం అందజేసినట్లు గోవర్ధన్ చెప్పారు. అయితే ముందుగా అంచనా వేసిన దాని కన్నా.. కాపర్ ప్లేట్లు, ద్వారపాలక విగ్రహాలు, పిల్లర్లు, శ్రీకోవిల్ డోర్ఫ్రేమ్ల నుంచి తీసిన బంగారం ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు సిట్ గుర్తించింది.
కోటింగ్ చేసిన బంగారం శ్యాంపిళ్లపై ప్రస్తుతం శాస్త్రీయ విశ్లేషణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పది మందిని సిట్ అరెస్టు చేసింది. దీంట్లో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇద్దరు మాజీ అధ్యక్షులు కూడా ఉన్నారు.