Viral news : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా అతిగా మద్యం సేవించినవారితో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వారి ఇళ్ల దగ్గర దింపుతామని, బెంగళూరు పోలీసులు ఈ బాధ్యతలు చూసుకుంటారని ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఇళ్లదగ్గర దింపడం వీలుకాదు కాబట్టి.. మత్తు దిగేవరకు వారిని ఉంచేందుకు సిటీలో 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
అయితే తాగినమైకంలో అసభ్యంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బార్లు, పబ్‌లలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాలతో సమస్య లేదని, కానీ రద్దీ ఎక్కువగా ఉండే బెంగళూరు, మైసూర్, హుబ్బళి, బెలగావి, మంగళూరులో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్డేట్ ఇచ్చారు.
ట్రాఫిక్, మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు వ్యాప్తంగా 20 వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. వారిలో ప్రత్యేకంగా శిక్షణపొందిన మహిళా బృందం కూడా ఉందన్నారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు.