– కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి
రామవరం, జనవరి 1 : మహిళల ఆర్థిక స్వావలంబనకు జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ దోహదం చేస్తదని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి అన్నారు. సీ.ఈ.ఆర్ క్లబ్లో కొనసాగుతున్న జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం కాలంలో ప్లాస్టిక్ విపరీత వాడకంతో పర్యావరణ కాలుష్యం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ జ్యూట్ బ్యాగ్ తయారీ కార్యక్రమాలను నిరుద్యోగ మహిళలకు నేర్పించి, వారికి స్వయం లబ్ధి చేకూరేలా, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళలు సద్వినియోగం చేసుకొని వారి కుటుంబాలను ఆర్థికంగా మెరుగు పరుచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సేవా సెక్రటరీ వై.అనిత, లేడీస్ క్లబ్ సెక్రెటరీ సునీత మురళితో కలిసి ఆమె కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, జ్యూట్ బ్యాగ్ తయారీ ట్రైనర్ పద్మావతి, సేవ కో-ఆర్డినేటర్ సీహెచ్.సాగర్, సేవా సభ్యులు పాల్గొన్నారు.