హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసినట్టు తెలిపారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బాలూనాయక్, పాయల్‌శంకర్, గండ్ర సత్యనారాయణరావు, వీర్లపల్లి శంకరయ్య, పాల్వాయి హరీశ్‌బాబు పలు ప్రశ్నలడిగారు. డీఆర్డీవోలో అవినీతిపరులను కాపాడొద్దని పాల్వాయి హరీశ్‌బాబు కోరగా, నియోజకవర్గ స్థాయిలో మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్‌చేశారు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 61 ఏండ్ల నుంచి 64 ఏండ్లకు పెంచడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు శాసనసభలో స్పష్టంచేశారు. సోమవా రం జీరో అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఉద్యోగుల వయోపరిమితి గురించి పలువురు తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బయట ఏదో ప్రచారం జరిగితే ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఏంటి? అని ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు, రీజినల్ రింగురోడ్డులో కాంగ్రెస్ నాయకుల భూములు ఉన్నాయనే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాకేశ్‌రెడ్డి ఆరోపించగా, 20 ఏండ్ల కింద కొన్న వారికి భూములు ఉండొచ్చని శ్రీధర్‌బాబు దాటవేశారు.