Chandrababu | హైదరాబాద్, జనవరి5 (నమస్తే తెలంగాణ) : ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించా. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదు’ ఇవీ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోటివెంట వెలువడిన బడాయి మాటలు.
గుంటూరులో సోమవారం నిర్వహించిన తెలుగు మహాసభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నాల్కల ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఐక్యతగా ఉండాలని, విద్వేషాలు వద్దని, తెలుగు ప్రజలంతా అభివృద్ధిలో కలిసి నడువాలంటు సుద్దులు చెప్పారు. అవన్నీ పైపైకి మాత్రమేనని బాబు ఆచరణ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ప్రతి ప్రాజెక్టుపై పనిగట్టుకుని లడాయికి దిగుతూ నాడు కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. ప్రతి వేదికపైనా అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేసులు వేయించారు. కొర్రీలు పెట్టారు. ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రాజెక్టులపై కక్షకట్టినట్టు ప్రవర్తించారు. జలహక్కులను సాధించుకోకుండా మోకాలడ్డారు. ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా సోమవారం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు బాబు రెండు నాల్కల ధోరణికి స్పష్టమైన ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతున్నదంటూ ఆరోపించింది. ఓవైపు విద్వేషాలు వద్దంటూ సుద్దులు చెప్తూనే, మరోవైపు సుప్రీంకోర్టు సాక్షిగా తెలంగాణపై విషం కక్కారు. ఇదే చంద్రబాబు అసలు నైజమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం కడితే తామెప్పుడూ అడ్డుకోలేదని, గోదావరిలో పుషలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టే అభ్యంతరం చెప్పలేదని బాబు బుకాయించారు. ఇందుకు మించిన అబద్ధం ప్రపంచంలోనే లేదన్నది అక్షర సత్యం. ఉమ్మడి పాలకులు నీటి లభ్యత లేనిచోట, అభయారణ్యం, అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తుతాయని తెలిసినా తమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేయగా, ఆ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని ప్రస్తుతం పదే పదే చెబుతున్నా సీఎం చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదంటూ కేంద్ర జల్‌శక్తిశాఖకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) లేఖలు రాశారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టినదే అయినా కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే ఏపీ పునర్విభజన చట్టాన్ని అనుసరించి ముందస్తు అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గగ్గోలు పెడుతూ ఫిర్యాదులు చేశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులోనూ ప్రాజెక్టుపై కొర్రీలు పెడుతూ వచ్చారు. అ యినా సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు మం జూరు చేయగా, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) తుది అనుమతులు జారీ చేసే తరుణంలోనూ 2018లో లేఖ రాశారు. ఇలా ప్రాజెక్టుపై ప్రతి దశలోనూ మోకాలడ్డుతూ వచ్చారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. కరువు, వలసల పేరు చెప్పుకుని ప్రపంచబ్యాంకు రుణాలను పొందారు తప్ప అందులో ఒక్క పైసా కూడా పాలమూరు ప్రాజెక్టులకు ఖర్చుచేయలేదు. కానీ అంతకు మించి విద్రోహాన్ని తలపెట్టారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) శ్రీకారం చుడితే ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు బాబు ప్రయత్నాలు చేశారు. ప్రాజెక్టుకు అనుమతులివ్వకూడదంటూ 2015 జూన్ కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సర్కార్ లేఖ రాసింది. సీడబ్ల్యూసీకి స్వయంగా బాబే ఫిర్యాదు చేశారు. అంతేకాదు నాటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతికి 2016లో ప్రత్యేకంగా బాబునే లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. స్థానిక రైతులు, అనుయాయులను ప్రోత్సహించి ఎన్జీటీలో కేసులు వేయించడమేకాదు, ఆ పిటిషన్లో పనిగట్టుకుని ఏపీ ఇంప్లీడ్ అయ్యింది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లోనూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ అభ్యంతరాలను లేవనెత్తింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వకూడదని ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.
తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన చంద్రబాబు, తెలంగాణ అభ్యంతరాలను బుట్టదాఖలు చేస్తూ నల్లమలసాగర్ లింకును చేపట్టారు. గోదావరి-పెన్నా, గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే మంచి జరుగుతుందంటూ ప రోక్షంగా నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు ఆమోదించాలంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించా రు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగువారంతా కలిసి ఉండాలని, ప్రపంచంలో తెలుగు జాతి నంబర్‌వన్‌గా ఉండాలంటే ఐకమత్యంగా ఉండాలని, అందుకు తా ను కట్టుబడి ఉన్నానని, గంగా-కావేరి కలువాలని.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలని.. అదే తన కోరికని చెప్పడం కొసమెరుపు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులు తెచ్చారని గొప్పలు చెప్పారు. తన హయాంలో.. తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని బడాయికి దిగారు. కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని, కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో నీటిని పొ దుపు చేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశానని, గోదావరి నదిపై గుత్ప, అలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల పథకాలను చేపట్టామని డబ్బా కొట్టుకున్నారు.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులే కాదు తెలంగాణ ప్రాజెక్టులన్నింటిపైనా బాబు అడుగడుగునా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రతి ప్రాజెక్టుపై, ప్రతి వేదికగా తెలంగాణపై వ్యతిరేకతను చాటుతూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసి అటకెక్కించిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించినా కూడా కొత్త ప్రాజెక్టులంటూ గగ్గోలు పెట్టారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన దిండి (నక్కలగండి) ప్రాజెక్టుపై, ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల లిఫ్ట్, ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్తరామదాసు లిఫ్ట్ స్కీమ్‌పై, సమీకృత సీతారామ సీతమ్మసాగర్, దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు చేపట్టిన సమ్మక్కసాగర్ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు. నీటిలభ్యత లేదంటూ, ఏపీకి నీరే అందకుండా పోతుందని చెబుతూ, అనుమతులివ్వకూడదంటూ సీడబ్ల్యూసీకి లేఖలు రాశారు. రివర్ బోర్డులకు ఫిర్యాదులు చేశారు. ఆఖరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ జలవిద్యుత్ కూడా చేపట్టకుండా చూడాలంటూ కేంద్రానికి అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతి వేదికపైనా తెలంగాణ ప్రాజెక్టులపై వ్యతిరేకతను చాటుకున్నారు.